LOADING...
Gig workers: కనీసం 90 రోజులు పనిచేయాలి: గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రతపై కేంద్రం కొత్త ముసాయిదా
కనీసం 90 రోజులు పనిచేయాలి

Gig workers: కనీసం 90 రోజులు పనిచేయాలి: గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రతపై కేంద్రం కొత్త ముసాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం గిగ్‌వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రయోజనాలు పొందాలంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్‌ వద్ద కనీసం 90రోజులు, లేదా ఒకటి కంటే ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద మొత్తం 120 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. గిగ్ వర్కర్లు మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో గత నెల రెండు సార్లు సమ్మెలకు దిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిబంధనలను రూపొందించడం విశేషం. ముసాయిదా ప్రకారం, ఒక రోజుకు ఒక అగ్రిగేటర్‌ వద్ద పని చేసినా,ఆ రోజు మొత్తం ఒక రోజుగా పరిగణించబడుతుంది. ఒక్కరోజులో ఒక గిగ్ వర్కర్ మూడు అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తే, అది మూడు రోజులుగా లెక్కించబడుతుంది.

వివరాలు 

ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసినవారికే సామాజిక భద్రతా ప్రయోజనాలు

అలాగే నేరుగా లేక పరోక్షంగా అగ్రిగేటర్‌తో కలిసి పనిచేసే వారిని గిగ్‌ వర్కర్‌గా గుర్తిస్తామని కేంద్రం పేర్కొంది. అసంఘటిత కార్మికులకు జాతీయ డేటాబేస్‌గా పరిగణిస్తున్న ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసినవారికే సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. కార్మికశాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ చేసినవారికి ఫొటో, ఇతర వివరాలతో కూడిన ఐడీ కార్డు జారీ చేయబడుతుంది, వారు ఎప్పటికప్పుడు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ ముసాయిదా డిసెంబర్ 30న విడుదల చేసింది.

వివరాలు 

10 నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని  డిమాండ్‌ 

ఇదిలా ఉండగా, డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెలకు దిగారు. ఈ సమ్మెలో, ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ పిలుపునుసరించి వర్కర్లు పాల్గొన్నారు. 10 నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంలో స్విగ్గీ (Swiggy) జొమాటో (Zomato) ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి.

Advertisement