LOADING...
Ethanol Fuel: ఇథనాల్‌ పెట్రోల్‌కు కేంద్రం భారీ ఊరట.. E22 నుంచి E30 వరకు ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!
E22 నుంచి E30 వరకు ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!

Ethanol Fuel: ఇథనాల్‌ పెట్రోల్‌కు కేంద్రం భారీ ఊరట.. E22 నుంచి E30 వరకు ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌లో అధిక శాతం ఇథనాల్‌ కలిపిన ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకాన్ని మినహాయిస్తూ నిర్ణయం ప్రకటించింది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్‌ మిశ్రమం కలిగిన ఈ22, ఈ25, ఈ27, ఈ30 రకాల పెట్రోల్‌కు ఈ పన్ను మినహాయింపు వర్తించనుంది. ఈ నిర్ణయం వల్ల దేశంలో అధిక ఇథనాల్‌ మిశ్రమ ఇంధనాల వినియోగానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, దేశీయంగా ఉత్పత్తి అయ్యే పర్యావరణహిత ఇంధనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

వివరాలు 

ఇటీవలే పెట్రోల్‌ మిశ్రమాలకు వెలువడిన కొత్త ప్రమాణాలు

ఇటీవలే భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) ఈ22,ఈ25,ఈ27,ఈ30 పెట్రోల్‌ మిశ్రమాలకు కొత్త నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది. ఇందులో ఇథనాల్‌ శాతం, ఆక్టేన్‌ రేటింగ్‌, సల్ఫర్‌ పరిమితులు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు కూడా ఇవ్వడంతో ఈ ఇంధనాల ఉత్పత్తి, వినియోగానికి అవసరమైన సాంకేతిక,ఆర్థిక మద్దతు మరింత బలపడినట్లైంది. దేశంలో ఇథనాల్‌ మిశ్రమ ఇంధనాల కార్యక్రమాన్ని కేంద్రం వేగవంతం చేస్తోంది. 2018లో ప్రవేశపెట్టిన జాతీయ బయోఫ్యూయల్‌ విధానాన్ని 2022లో సవరించిన ప్రభుత్వం, 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025-26 నాటికే సాధించాలని నిర్ణయించింది.

వివరాలు 

వాహనదారులు సందేహాలు

ఈ క్రమంలో ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ సంస్థలు 2022 జూన్‌లోనే 10 శాతం ఇథనాల్‌ మిశ్రమ లక్ష్యాన్ని చేరుకోగా, ఆ తర్వాత కూడా మిశ్రమాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌పై గతంలో కొందరు వాహనదారులు సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైలేజ్‌, ఇంజిన్‌ పనితీరుపై ఆందోళనలు వెలువడ్డాయి. అయితే ఈ20 ఇంధనం వాహనాల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలిగించదని వాహన తయారీ సంస్థల సంఘం స్పష్టం చేసింది. విస్తృత అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనల అనంతరమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది.

Advertisement