LOADING...
WhatsApp's username feature: వాట్సప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం దృష్టి.. భద్రతా అంశాలపై సమీక్ష
వాట్సప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం దృష్టి.. భద్రతా అంశాలపై సమీక్ష

WhatsApp's username feature: వాట్సప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం దృష్టి.. భద్రతా అంశాలపై సమీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ ప్రవేశపెట్టనున్న యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ ఫీచర్‌ను పరిశీలిస్తోంది. ఆన్‌లైన్‌ మోసాలు,వినియోగదారుల భద్రత, సైబర్‌ రిస్క్‌ల కోణంలో ఈ కొత్త ఫీచర్‌ను సమగ్రంగా సమీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశీలనలో ఏవైనా భద్రతాపరమైన లోపాలు లేదా ప్రమాదాలు ఉన్నట్లు తేలితే మెటాకు నోటీసు జారీ చేసే అవకాశముందని వెల్లడించాయి. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

వివరాలు 

యూజర్‌నేమ్‌ ఫీచర్‌ అంటే ఏమిటి?

వినియోగదారుల ఫోన్‌ నంబర్‌ గోప్యతను కాపాడే లక్ష్యంతో వాట్సప్‌ యూజర్‌నేమ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో ఇతరులతో చాట్‌ చేయడానికి ఫోన్‌ నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం ఉండదు. యూజర్‌నేమ్‌ ఆధారంగానే సంభాషణలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం యూజర్లు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందుగానే రిజర్వ్‌ చేసుకునే అవకాశాన్ని వాట్సప్‌ కల్పిస్తోంది. యూజర్‌నేమ్‌ పొడవు కనీసం 3 అక్షరాల నుంచి గరిష్ఠంగా 35 అక్షరాల వరకు ఉండేలా నిబంధనలు రూపొందించింది. అలాగే సెలబ్రిటీలు, అత్యున్నత హోదాల్లో ఉన్న ప్రముఖుల పేర్లను యూజర్‌నేమ్‌లుగా అనుమతించబోమని తెలిపింది. ఈ ఫీచర్‌ వల్ల ఫోన్‌ నంబర్‌ ఇతరులకు కనిపించదని, ముఖ్యంగా పెద్ద గ్రూపుల్లో చేరినప్పుడు వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు మరింత రక్షణ లభిస్తుందని వాట్సప్‌ పేర్కొంటోంది.

వివరాలు 

సైబర్‌ నిపుణుల ఆందోళనలు ఏమిటి?

ఫోన్‌ నంబర్‌ను వెల్లడించకుండా చాట్‌ చేసే అవకాశం కల్పించే ఈ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై సైబర్‌ భద్రత నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సుపరిచితమైన వ్యక్తుల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్‌లు సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులు యూజర్‌నేమ్‌లను అంచనా వేసి నేరుగా సందేశాలు పంపే అవకాశం ఉండటంతో స్పామ్‌ మెసేజ్‌లు, అనవసర సంప్రదింపులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఫోన్‌ నంబర్ల గోప్యత పరంగా ఈ ఫీచర్‌ ఉపయోగకరమైనదే అయినప్పటికీ, మోసాలను అరికట్టేందుకు బలమైన భద్రతా వ్యవస్థలు లేకపోతే టెలిగ్రామ్‌లో కనిపిస్తున్న తరహా మోసాలకు వాట్సప్‌ కూడా వేదికగా మారే అవకాశం ఉందని సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement