Petrol-diesel: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్ ట్యాక్స్ మళ్లీ పెంపు!
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి సవరించి డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై పెంచింది. అయితే పెట్రోల్‌పై ప్రస్తుతం అమలులో ఉన్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను యథాతథంగా కొనసాగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి విండ్‌ఫాల్ ట్యాక్స్ రేట్లను సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తూ వస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగానే తాజా సవరణలు అమలులోకి తీసుకొచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్ విధానాన్ని తిరిగి అమలు చేయడం ప్రారంభించింది.
వివరాలు
డీజిల్, ఏటీఎఫ్‌పై పెరిగిన సుంకాలు
మొదట కొంత మేర పెంచి, అనంతరం తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పెంపు నిర్ణయం తీసుకుంది. గతంలో డీజిల్‌పై ఎగుమతి సుంకం లీటర్‌కు రూ.13.50గా ఉండేది. తాజా సవరణలతో అది రూ.15కు పెరిగింది. అదే విధంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై లీటర్‌కు రూ.9.50గా ఉన్న ఎగుమతి సుంకాన్ని రూ.12.50కు పెంచారు. అంటే ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.3 మేర అదనపు సుంకాన్ని విధించారు. మరోవైపు పెట్రోల్‌పై ఎగుమతి సుంకం లీటర్‌కు రూ.1.50గానే కొనసాగనుంది. కొత్త రేట్లు జూన్ 16 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే జూలై 1న మరోసారి ఈ రేట్లను సమీక్షించి సవరణలు చేసే అవకాశముందని తెలుస్తోంది.
వివరాలు
ముడి చమురు ధరలకు అనుగుణంగానే మార్పులు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను సవరిస్తూ వస్తోంది. ఇటీవల కాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఒక దశలో బ్యారెల్ ధర 120 డాలర్లకు పైగా చేరుకోగా, ప్రస్తుతం అది సుమారు 80 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ట్యాక్స్ విధానంలో తాజా మార్పులు చేపట్టింది.
వివరాలు
విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ఎందుకు ప్రవేశపెట్టారు?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా విండ్‌ఫాల్ ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ ఇంధన కంపెనీలు విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేసి అధిక లాభాలు ఆర్జించాయి. దీంతో దేశీయ అవసరాలకు ఇంధన లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎగుమతులపై అదనపు సుంకంగా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం అమలు చేసింది. అనంతరం యుద్ధ ప్రభావం తగ్గడంతో 2024 చివర్లో ఈ విధానాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది.
వివరాలు
ప్రతి 15 రోజులకు ఒకసారి వడ్డీ రేట్లపై సమీక్షా
అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించడంతో ఈ ఏడాది మార్చిలో కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రేట్లను సమీక్షిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాలను పెంచడం చర్చనీయాంశంగా మారింది.