Page Loader
Budget: పాత, కొత్త ఆదాయ పన్ను విధానాల్లో మార్పులు.. ట్యాక్స్‌పేయర్ల ఆశలు నెరవేరనున్నాయా?
పాత, కొత్త ఆదాయ పన్ను విధానాల్లో మార్పులు.. ట్యాక్స్‌పేయర్ల ఆశలు నెరవేరనున్నాయా?

Budget: పాత, కొత్త ఆదాయ పన్ను విధానాల్లో మార్పులు.. ట్యాక్స్‌పేయర్ల ఆశలు నెరవేరనున్నాయా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో మార్పులపై ట్యాక్స్‌పేయర్లు, వేతన జీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పాత, కొత్త ఆదాయ పన్ను విధానాలను అనుసరించే వారు తమకున్న అవసరాలను తీర్చాలనే డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ ఆర్థిక పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉంది. స్టాక్‌ మార్కెట్ల పతనం, రూపాయి మారకం విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు మందగింపు, అధిక వడ్డీరేట్లు, ఉత్పత్తి రంగం నిరాశపరచడం, వినిమయ సామర్థ్యం తగ్గడం వంటి అంశాలు మోదీ ప్రభుత్వానికి సవాలుగా మారాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.

Details

ఆదాయ పన్ను విధానాలు - ప్రస్తుత పరిస్థితి 

కొత్త ఆదాయ పన్ను విధానం పన్ను మినహాయింపులు లేకుండా, సరళతరమైన పన్ను విధానంగా 2020 బడ్జెట్‌లో మోదీ సర్కారు ప్రవేశపెట్టింది. ఇందులో నిర్ణీత ఆదాయ శ్రేణులకు తగిన పన్ను శ్లాబులు మాత్రమే ఉంటాయి. పాత ఆదాయ పన్ను విధానం ఇందులో పలు సెక్షన్ల కింద పెట్టుబడులు, పొదుపు మార్గాలు, ఆదాయ-వ్యయాలకు అనుగుణంగా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. ప్రస్తుతం 72శాతం ట్యాక్స్‌పేయర్లు కొత్త పన్ను విధానాన్ని అనుసరిస్తుండగా 28శాతం పాత పన్ను విధానాన్ని పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ, ప్రతీ బడ్జెట్‌లో పాత విధానంలో మార్పులు చేయకుండా, కొత్త విధానానికే మెరుగులు దిద్దుతోంది. అయితే ఈసారి రెండింటిలోనూ మార్పులు కావాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు.

Details

ట్యాక్స్‌పేయర్ల డిమాండ్లు

1. పన్ను మినహాయింపు కనీస పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలి. 2. స్టాండర్డ్‌ డిడక్షన్‌ కొత్త పన్ను విధానంలో ఉన్నట్లుగానే స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.75,000కు పెంచాలి 3. గృహ రుణం (హోం లోన్‌) సెక్షన్‌ 24 కింద గృహ రుణం వడ్డీపై ప్రస్తుతం వర్తిస్తున్న రూ.2 లక్షల మినహాయింపును రూ.3 లక్షలకు పెంచాలి. 4. సెక్షన్‌ 80C, 80D మినహాయింపులు 80C కింద గరిష్ఠ మినహాయింపును రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు, 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై ఉన్న మినహాయింపును రూ.25,000 నుంచి రూ.40,000కు పెంచాలి. సీనియర్‌ సిటిజన్లకు ప్రస్తుతం ఉన్న రూ.50,000 మినహాయింపును రూ.75,000కు పెంచాలి.

Details

కొత్త ఆదాయ పన్ను విధానంలో మార్పులు 

1. పన్ను రేట్లు వార్షిక ఆదాయం రూ.12-15 లక్షల మధ్య ఉంటే పన్ను రేటును 20% నుంచి 15%కి తగ్గించాలి. రూ.15-20 లక్షల ఆదాయానికి ప్రస్తుత *30% రేటును 20%కి తగ్గించాలి. రూ.20 లక్షలపై ఆదాయానికి 30% పన్ను కొనసాగించాలి. ఈ మార్పులతో మధ్య తరగతి వేతన జీవులకు ఊరట లభించడం, వినిమయ శక్తి పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2. స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75,000 నుంచి రూ.1 లక్షకు పెంచాలి. 3. ఎన్‌పీఎస్‌ (NPS) మినహాయింపులు పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80CCD (1) కింద రూ.1.5 లక్షల మినహాయింపు వర్తిస్తోంది. అదనంగా (1B) కింద రూ.50,000 మినహాయింపును పొందే వీలుంది.

Details

తీర్పు కోసం వేచిచూడాల్సిందే 

ప్రతేడాది బడ్జెట్‌లో కేంద్రం కొత్త పన్ను విధానానికి ప్రోత్సాహం ఇస్తూనే ఉంది. అయితే, పాత పన్ను విధానంలో మార్పుల కోసం ట్యాక్స్‌పేయర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ప్రభుత్వం ట్యాక్స్‌పేయర్ల డిమాండ్లను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మిగిలిన మార్పులు, కొత్త ప్రయోజనాలపై పూర్తి స్థాయి స్పష్టత కోసం ఫిబ్రవరి 1 వరకు వేచిచూడాల్సిందే!