Gold Exchange: విలువ ఆధారిత పన్ను మినహాయింపును తొలగించిన చైనా.. బంగారం ధరలపై ప్రభావం?
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో బంగారం మార్కెట్‌పై కీలక ప్రభావం చూపే నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకు విక్రయదార్లు షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ (Shanghai Gold Exchange) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి విక్రయించే సమయంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)పై మినహాయింపు పొందుతున్నారు. అయితే, ఈ మినహాయింపును నవంబర్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తూ, ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేసిన బంగారాన్ని యథాతథంగా విక్రయించినా, లేదా ప్రాసెసింగ్ చేసిన తర్వాత విక్రయించినా, ఇకపై వ్యాట్ సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండదని తెలిపింది.
Details
రిటైల్ వినియోగదారులకు ప్రోత్సాహాకం
ఈ నిర్ణయం బంగారం మార్కెట్‌కు ప్రతికూలంగా మారవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విశ్లేషకుల ప్రకారం, ఇప్పటివరకు ఉన్న వ్యాట్ మినహాయింపు రిటెయిల్ వినియోగదారులను బంగారం కొనుగోలుకు ప్రోత్సహించేది. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతుండటంతో, ఆ ఆకర్షణ మరింతగా పెరిగింది. కానీ, కొత్త నిబంధనల అమలుతో బంగారం కొనుగోలుపై ఉన్న ఆకర్షణ తగ్గి, రిటెయిల్ మార్కెట్‌లో గిరాకీ కొంత మందగించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.