Stock market:నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. 22,400 దిగువకు నిఫ్టీ.. 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆ లాభాలను కోల్పోయాయి.
హోలీ సందర్భంగా శుక్రవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ఉండటంతో, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలు ప్రపంచ మార్కెట్లను వెంటాడుతున్నాయి.
ఈ నేపథ్యంలో, కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకంజ వేశారని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
దీని ప్రభావంతో, సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు నష్టపోగా, నిఫ్టీ 22,400 దిగువన వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $70
సెన్సెక్స్ ఉదయం 74,392.54 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై, ఇంట్రాడేలో 74,401 గరిష్ఠాన్ని తాకింది.
కానీ అమ్మకాలతో సూచీలు నష్టాల్లోకి జారుకుని, చివరకు 200.85 పాయింట్ల నష్టంతో 73,828.91 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 73.30 పాయింట్ల నష్టంతో 22,397.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 87గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $70 వద్ద, బంగారం ఔన్సు $2953 వద్ద ట్రేడవుతోంది.