Claude Mythos: బ్యాంకింగ్ వ్యవస్థకు క్లాడ్ మిథోస్ ముప్పు.. పెరుగుతున్న సైబర్ ఆందోళనలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం సాంకేతిక రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో, సైబర్ ముప్పులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన 'క్లాడ్ మిథోస్' అనే అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాలుగా మారింది. అధునాతన హ్యాకింగ్ సామర్థ్యాలున్న ఈ టూల్ వల్ల మునుపెన్నడూ లేని విధంగా సైబర్ ప్రమాదాలు పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నియంత్రణ సంస్థలు అప్రమత్తమయ్యాయి.
వివరాలు
ఎందుకు ప్రమాదకరం?
భద్రతా కారణాల దృష్ట్యా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఎంపిక చేసిన టెక్ సంస్థలకు మాత్రమే ఈ టూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇటీవల అనధికార వ్యక్తులు కూడా దీనికి యాక్సెస్ పొందినట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ టూల్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఏ బ్యాంకింగ్ వ్యవస్థనైనా సులభంగా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. బ్యాంకులు ఇంకా పాత ఐటీ వ్యవస్థలపై ఆధారపడి పనిచేస్తుండటంతో, అవి ఇలాంటి దాడులకు సులభంగా గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలు పేమెంట్లు, క్లియరింగ్ నెట్‌వర్క్‌లు, ఇతర ఆర్థిక సంస్థలతో బలంగా అనుసంధానమై ఉన్నాయి.
వివరాలు
భద్రతా వ్యవస్థలను పునఃసమీక్షించుకోవాలి
కాబట్టి ఒకే బ్యాంకుపై సైబర్ దాడి జరిగినా, దాని ప్రభావం నిమిషాల్లోనే దేశీయ, అంతర్జాతీయ బ్యాంకులు, విదేశీ మారకపు ద్రవ్యం, మనీ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు, డిపాజిటరీలు, పేమెంట్ గేట్‌వేలకు విస్తరించే ప్రమాదం ఉంది. ఈ ముప్పు నేపథ్యంలో ఆసియా, ఐరోపా, అమెరికా దేశాల నియంత్రణ సంస్థలు తమ భద్రతా వ్యవస్థలను పునఃసమీక్షించుకోవాలని బ్యాంకులను హెచ్చరించాయి. అమెరికా ప్రభుత్వం వాల్‌స్ట్రీట్ బ్యాంకులతో భద్రతా చర్యలపై చర్చలు జరుపుతుండగా, వైట్ హౌస్ ఈ ఏఐనే భద్రత కోసం వినియోగించాలనే ఆలోచనలో ఉంది.
వివరాలు
అసలు ఏమిటిది?
"క్లాడ్ మిథోస్" అనేది ఆంత్రోపిక్ రూపొందించిన శక్తివంతమైన ఏఐ టూల్. ఇది సైబర్ భద్రతా లోపాలను గుర్తించడంలో అత్యంత చురుకుగా పనిచేస్తుంది. దాదాపు 27 ఏళ్లనాటి పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు, వెబ్ బ్రౌజర్లలోని లోపాలను కూడా ఇది గుర్తించగలదు. అత్యున్నత కోడింగ్ సామర్థ్యాలతో ఇది లోపాలను గుర్తించడమే కాకుండా, వాటిని ఉపయోగించి ఎలా దాడి చేయాలో కూడా కొత్త మార్గాలను అభివృద్ధి చేయగలదు. అందువల్ల ఇది సామాన్యులకు అందుబాటులోకి వస్తే, ప్రతి ఒక్కరి చేతిలో శక్తివంతమైన హ్యాకింగ్ ఆయుధం చేరినట్టే అవుతుందని భావించి, దీన్ని ప్రజలకు విడుదల చేయలేదు.
వివరాలు
బ్యాంకర్లతో సమీక్ష
ఈ ముప్పుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. కస్టమర్ల డేటా రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు. బ్యాంకులు, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In), ఇతర సంస్థల మధ్య రియల్‌టైమ్ సమాచార మార్పిడి కోసం బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక మిథోస్ వల్ల కలిగే నష్టాలను అంచనా వేసి పరిష్కార మార్గాలు సూచించేందుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సి. శ్రీనివాసులు శెట్టి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నిర్మలా సీతారామన్ నియమించారు.