కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్
బ్రియాన్ హంఫ్రీస్‌ను ఎటువంటి కారణం లేకుండానే అసంకల్పితంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి జనవరిలో కాగ్నిజెంట్ తొలగించింది. ఈ మేరకు కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సీఈఓగా రవికుమార్ ఆకస్మిక నియామకంతో బ్రియాన్ హంఫ్రీస్‌ను తొలగించిన విషయం బయటికి వచ్చింది. ఒక సీఈఓ కారణం లేకుండా అసంకల్పితంగా తొలగించబడినప్పుడు అతనికి కంపెనీ నుంచి రావాల్సిన ఆర్థిక బెన్‌ఫిట్స్‌కు అర్హుడవుతాడు.
భారతదేశంలో 2,58,500 మంది ఉద్యోగులు
2023లో కాగ్నిజెంట్ వేగంగా పురోగమించడం, దాని వాణిజ్య వేగాన్ని పెంచడం, ఆదాయ వృద్ధిని వేగవంతం చేయడం వంటి అవసరాన్ని బోర్డు గుర్తించిందని, అందుకే కొత్త సీఈఓ అవసరమని భావించినట్లు కాగ్నిజెంట్ బోర్డు డైరెక్టర్ స్టీఫెన్ జె రోహ్లెడర్ పేర్కొన్నారు. షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన రవికుమార్ కాగ్నిజెంట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రవికుమార్ షేర్ హోల్డర్లకు రాసిన నోట్‌లో కంపెనీ వర్క్‌ఫోర్స్ పరంగా భారతదేశంలో ఉనికిని గురించి ప్రస్తావించారు. కాగ్నిజెంట్‌లో డిసెంబర్ 31, 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,55,300 మంది ఉద్యోగుల్లో 2,58,500 మంది భారతదేశంలోనే ఉన్నారు.