Page Loader
CoinDCX: ఫండ్స్‌ రికవర్‌ చేస్తే 25% రివార్డ్‌.. కాయిన్‌డీసీఎక్స్‌ ప్రకటన 
ఫండ్స్‌ రికవర్‌ చేస్తే 25% రివార్డ్‌.. కాయిన్‌డీసీఎక్స్‌ ప్రకటన

CoinDCX: ఫండ్స్‌ రికవర్‌ చేస్తే 25% రివార్డ్‌.. కాయిన్‌డీసీఎక్స్‌ ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్‌ దాడి కారణంగా సుమారు 44.2 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.378 కోట్ల) నష్టం చవిచూసిన భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ అయిన కాయిన్‌డీసీఎక్స్‌ (CoinDCX) కీలక ప్రకటన చేసింది. ఈ సొమ్ము రికవరీలో సహకరించిన వారికి రికవర్‌ చేసిన మొత్తంలో 25 శాతం వరకు బహుమతిగా (రివార్డ్‌గా) అందిస్తామని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఎథికల్‌ హ్యాకర్లు, వైట్‌-హ్యాట్ రీసెర్చర్లు, ఇతర సైబర్‌ సెక్యూరిటీ భాగస్వాములకు పిలుపునిచ్చింది. సైబర్‌ క్రైమ్‌పై వెబ్‌3 కమ్యూనిటీ కట్టుదిట్టంగా పోరాడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సూచించింది. ఈనెల 19వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో కాయిన్‌డీసీఎక్స్‌లో సైబర్‌ దాడి జరిగినట్టు వెల్లడైంది.

వివరాలు 

వజీర్‌ఎక్స్‌ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో 230 మిలియన్‌ డాలర్ల విలువైన సైబర్‌ చోరీ

భాగస్వామి ఎక్స్ఛేంజ్‌లో ఉన్న తమ ఖాతాల్లో, ఒక ఖాతాలో ధృవీకరణ లేని చొరబాటు జరిగినట్టు సంస్థ భద్రతా నిపుణులు గుర్తించారు. ఈ హ్యాకింగ్‌ దాడి కారణంగా సంస్థకు దాదాపు రూ.378 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారికంగా వెల్లడైంది. అయితే వినియోగదారుల నిధులు పూర్తిగా భద్రంగా ఉన్నట్టు,వాటిపై ఎలాంటి ప్రభావం పడలేదని కాయిన్‌డీసీఎక్స్‌ సహవ్యవస్థాపకులు సుమిత్‌ గుప్తా,నీరజ్‌ ఖండేల్‌వాల్‌లు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్‌'లో స్పష్టం చేశారు. సైబర్‌ దాడి వల్ల నష్టపోయిన మొత్తాన్ని సంస్థ స్వయంగా భరిస్తుందని, ఇందుకోసం తమ అంతర్గత నిల్వలను వినియోగిస్తామని కంపెనీ ప్రకటించింది. ఇంతకుముందు కూడా 2024లో వజీర్‌ఎక్స్‌ అనే మరో ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో 230 మిలియన్‌ డాలర్ల విలువైన సైబర్‌ చోరీ జరిగిన విషయం తెలిసిందే.