LPG cylinder: మళ్లీ పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర.. ఏకంగా రూ.933 పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (Commercial LPG cylinder) ధర భారీగా పెరిగింది. ఒక్క 19 కేజీల సిలిండర్‌పై సగటున రూ.993 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఈ ధరల పెరుగుదల చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రెండు నెలలు గడిచినా ముగింపు దశకు చేరలేదు. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఏర్పడుతున్న అంతరాయాలు ఈ పెంపుకు కారణమయ్యాయని సమాచారం. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధర మూడోసారి పెరిగినట్లైంది.
వివరాలు
పెట్రోల్, డీజల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
మార్చిలో రూ.144, ఏప్రిల్ 1న రూ.195 పెరిగిన తర్వాత, ఇప్పుడు ఒక్కసారిగా రూ.993 పెంపు జరిగింది. దీంతో ఒక్క వాణిజ్య సిలిండర్ ధర రూ.3,000 దాటింది. హైదరాబాద్‌లో ధర రూ.3,315కి చేరగా, దిల్లీలో ఒక సిలిండర్ ధర రూ.3,071గా నమోదైంది. ఈ ధరల పెరుగుదల రెస్టారెంట్లు, హోటళ్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. అలాగే దేశీయ విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల్లో కూడా ఎలాంటి మార్పు చేయలేదని వెల్లడించారు. ఇక 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.914.50కి పెరిగింది.