LOADING...
Company gift: ఉద్యోగులకు బహుమతిగా రూ.1.5కోట్ల విలువైన ఫ్లాట్స్‌.. చైనా కంపెనీ షాకింగ్ ఆఫర్!
చైనా కంపెనీ షాకింగ్ ఆఫర్!

Company gift: ఉద్యోగులకు బహుమతిగా రూ.1.5కోట్ల విలువైన ఫ్లాట్స్‌.. చైనా కంపెనీ షాకింగ్ ఆఫర్!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యమైన సిబ్బందిని నిలుపుకోవడానికి చైనా సంస్థ ఒకటి వినూత్న నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రూ.1.3 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మూడేళ్ల వ్యవధిలో మొత్తం 18 ఫ్లాట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం ద్వారా ఉద్యోగుల నిబద్ధతను పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) వెల్లడించింది. ఆటోమొబైల్ విడిభాగాలు తయారు చేసే జెజియాంగ్ గ్వోషెంగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థలో ప్రస్తుతం 450 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 2024 సంవత్సరానికి కంపెనీ మొత్తం ఉత్పత్తి విలువ సుమారు 7 కోట్ల డాలర్లు ఉన్నట్లు అంచనా.

వివరాలు 

 మూడేళ్లలో 18 ఫ్లాట్లు పంపిణీ లక్ష్యం 

సంస్థలో ఎక్కువ మంది వలస కార్మికులే కావడంతో, సాంకేతిక,నిర్వహణ విభాగాల్లో పనిచేసే వారికి దీర్ఘకాల స్థిరత్వం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ తెలిపారు. "ఈ ఏడాది ఐదు ఫ్లాట్లు ఇచ్చాం. వచ్చే ఏడాది మరో ఎనిమిది ఫ్లాట్లు ఇవ్వాలనుకుంటున్నాం. మొత్తం మూడేళ్లలో 18 ఫ్లాట్లు పంపిణీ చేయడం మా లక్ష్యం," అని ఆయన నేషనల్ బిజినెస్ డైలీకి చెప్పారు. "ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడం,మా ప్రధాన మేనేజ్‌మెంట్ బృందాన్ని నిలుపుకోవడమే మా ఉద్దేశం,"అని స్పష్టం చేశారు. ఈ ఫ్లాట్లన్నీ కంపెనీ పరిశ్రమ స్థావరానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. వీటి విస్తీర్ణం 100 నుంచి 150 చదరపు మీటర్ల మధ్య ఉంది.

వివరాలు 

పథకం ప్రకారం ఉద్యోగులు ముందుగా గృహ ఒప్పందంపై సంతకం చేయాలి

అక్కడ ఆ ప్రాంతంలో రీసేల్ ఇళ్ల ధర చదరపు మీటరుకు 7,000 నుంచి 8,500 యువాన్లు ఉంటుందని సమాచారం. ఈ పథకం ప్రకారం ఉద్యోగులు ముందుగా గృహ ఒప్పందంపై సంతకం చేయాలి. కంపెనీ ఇంటి మరమ్మతులు పూర్తిచేసిన తర్వాతే వారు అందులోకి వెళ్లాలి. ఐదేళ్లు సేవ పూర్తిచేసిన అనంతరం ఆ ఇల్లు అధికారికంగా ఉద్యోగి పేరిట బదిలీ అవుతుంది. అయితే, మరమ్మతుల ఖర్చు మాత్రం ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మొత్తం 18 ఫ్లాట్లను కంపెనీ కొనుగోలు చేసినట్లు వాంగ్ తెలిపారు. ఈ ఏడాది ఇచ్చిన ఐదు ఫ్లాట్లలో, మొదట సాధారణ ఉద్యోగులుగా చేరి క్రమంగా మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు.

Advertisement

వివరాలు 

ఏడాదికి లక్షలాది యువాన్లు 

ఈ పథకానికి అర్హత పొందే ఉద్యోగులకు ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరమని, కొత్తగా చదువు పూర్తిచేసిన వారికి వెంటనే ఈ పనులు సాధ్యపడవని ఆయన చెప్పారు. కంపెనీ ఖర్చులను తగ్గించడం, పనితీరు నాణ్యతను మెరుగుపరచడం వంటి లక్ష్యాలకు ఇది అనుగుణంగా ఉందని వివరించారు. "ఈ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే, ఏడాదికి లక్షలాది యువాన్లను కంపెనీకి ఆదా చేయడం అసాధ్యం కాదు," అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement