Data centers: డేటా సెంటర్లకు తెలుగు రాష్ట్రాల పోటీ.. తెలంగాణ టాప్, ఏపీకి ప్రత్యేక బలం!
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న కొద్దీ డేటా సెంటర్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య పోటీ తీవ్రంగా మారుతోంది. విద్యుత్తు, రాయితీలు, భూమి, మూలధన ప్రోత్సాహకాలు, అనుమతుల సరళీకరణ వంటి అంశాల్లో రాష్ట్రాలు ప్రత్యేక విధానాలను రూపొందిస్తున్నాయి. ఈ పోటీలో అత్యంత ఆకర్షణీయమైన డేటా సెంటర్ పాలసీని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. భూమి, మూలధన మద్దతు, ఇతర ప్రోత్సాహకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉన్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఎనర్జీ రూపొందించిన 'డేటా సెంటర్ పాలసీ అట్రాక్టివ్‌నెస్ ఇండియా (డీసీపీఏఐ)' సూచీ వెల్లడించింది. 'ఇండియా ఫార్వర్డ్- రీఇమాజినింగ్ గ్రోత్' నివేదికలో భాగంగా ఈ సూచీని రూపొందించారు.
వివరాలు
తెలంగాణకు విద్యుత్తు బలం..
2016 నుంచి 11 రాష్ట్రాలు అమలు చేస్తున్న ఐటీ, ఐటీఈఎస్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు సంబంధించిన 19విధానాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్ విశ్లేషించింది.
డేటా సెంటర్ పాలసీ ఆకర్షణలో తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ తొలి క్లస్టర్‌లో ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు దాదాపు 100కు 50స్కోరు స్థాయిలో ఉన్నాయి.
విద్యుత్తు, నియంత్రణపరమైన ప్రోత్సాహకాల విషయంలో తెలంగాణ డేటా సెంటర్లకు బలమైన ప్యాకేజీలను అందిస్తోంది. డేటా సెంటర్లు నిరంతరం పనిచేయాల్సి ఉండటంతో విద్యుత్తు లభ్యత, టారిఫ్ ప్రయోజనాలు కీలకంగా మారుతున్నాయి.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు విద్యుత్తుతో పాటు మౌలిక వసతులు, మూలధన ప్రోత్సాహకాలు, నియంత్రణపరమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి.
హైపర్‌స్కేలర్లను ఆకర్షించేందుకు విద్యుత్తు, సులభతర వ్యాపార నిర్వహణ చర్యలకు గుజరాత్ ప్రాధాన్యం ఇస్తోంది.
వివరాలు
ఆంధ్రప్రదేశ్ బలం..
డేటా సెంటర్ పాలసీ ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రెండో క్లస్టర్‌లో ఉంది. ఈ క్లస్టర్ స్కోరు 42-45 మధ్య ఉంది. అయితే భూమి, మూలధన మద్దతు విషయంలో ఏపీ అగ్రగామిగా ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ పేర్కొంది. డేటా సెంటర్ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో భూమి అవసరమవుతుంది.
అదే సమయంలో సర్వర్లు, విద్యుత్తు మౌలిక వసతులు, కూలింగ్ వ్యవస్థలు, నెట్‌వర్క్ సదుపాయాలపై భారీగా మూలధన వ్యయం చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో భూమి కేటాయింపు, మూలధన ప్రోత్సాహకాల విషయంలో ఏపీకి ఉన్న బలం.. డేటా సెంటర్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా మారుతోంది.
కర్ణాటక, ఒడిశా, హరియాణా కూడా పాలసీ పరంగా రెండో క్లస్టర్‌లో ఉన్నాయి. సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో కర్ణాటక ప్రత్యేకంగా నిలిచింది.
వివరాలు
పెట్టుబడుల కోసమే రాష్ట్రాల పోటీ..
డేటా సెంటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య పోటీ పెరగడానికి పలు కారణాలున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ విశ్లేషించింది.
సాధారణ ఐటీ కార్యాలయాలతో పోలిస్తే డేటా సెంటర్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో విద్యుత్తు, భూమి, మౌలిక వసతులను వినియోగిస్తాయి.
వీటి నిర్మాణ దశలోనే కాకుండా నిర్వహణ సమయంలోనూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తాయి.
అందుకే రాష్ట్రాలు ఒకవైపు భూమి, మూలధన రాయితీలు అందిస్తూనే.. మరోవైపు విద్యుత్తు ధరలు, పునరుత్పాదక ఇంధనం, అనుమతుల వేగం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి.
రాష్ట్రాల మధ్య ఈ పోటీని 'కాంపిటేటివ్ ఫెడరలిజం'గా ఎస్‌అండ్‌పీ గ్లోబల్ పేర్కొంది.
వివరాలు
2031-32 నాటికి 26.3 గిగావాట్ల సామర్థ్యం..
భారత్‌లో డేటా సెంటర్ల విస్తరణ రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకోనుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్లుగా ఉంది.
రాబోయే పదేళ్లలో మరో 5 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే వచ్చాయి.
అదనంగా 6-7 గిగావాట్ల సామర్థ్యం ప్రాథమిక ప్రణాళిక దశలో ఉంది. దీంతో 2031-32 నాటికి దేశీయ డేటా సెంటర్ల సామర్థ్యం 26.3 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా.
వివరాలు
విద్యుత్తు గిరాకీలో 18 శాతం వృద్ధి..
డేటా సెంటర్ల విస్తరణతో వాటికి అవసరమయ్యే విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరగనుంది.
సర్వర్లతో పాటు కూలింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వంటి వ్యవస్థలు పెద్ద మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తాయి.
ఈ నేపథ్యంలో 2025-35 మధ్య డేటా సెంటర్ల రంగంలో విద్యుత్తు గిరాకీ ఏటా సగటున 18 శాతం పెరుగుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అంచనా వేసింది.