Credit Card : 'క్రెడిట్ కార్డు వ్యయాలు విపరీతం.. ఒక్క అక్టోబరులోనే రూ.1.78 లక్షల కోట్లు'
దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ద్వార జరుపుతున్న లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మేరకు పండగ సీజన్ నేపథ్యంలో అక్టోబరులో క్రెడిట్ కార్డు వ్యయాలు భారీగా పెరిగాయి. క్రెడిట్ కార్డు ద్వారా చేస్తున్న ఖర్చు (Credit Card Spends) దేశీయంగా 2023 అక్టోబరులో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఒక్క నెలలోనే రూ.1.78లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయంటే ఖర్చు ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు. 2023 సెప్టెంబరులో నమోదైన రూ.1.42లక్షల కోట్లతో పోలిస్తే ఇది 25.35శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో పండగ సీజన్ సందర్భంగా 'పాయింట్ ఆఫ్ సేల్(PoS),ఇ-కామర్స్ లావాదేవీలు వృద్ధికి దోహదం చేసింది. క్రెడిట్ కార్డు ద్వారా పీఓఎస్ లావాదేవీలు అక్టోబరులో రూ.57,774 కోట్లకు చేరాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
ఏఏ బ్యాంక్ ఎన్నెన్ని కార్డులు ఇచ్చాయంటే
దీంతో ఇ-కామర్స్ చెల్లింపులు రూ.1,20,794 కోట్లకు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తొలి స్థానాన్ని పదిలం చేసుకుంది. సెప్టెంబరులో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.38,662 కోట్లు లావాదేవీలు జరిగాయి. అక్టోబర్‌లో ఆ మొత్తం రూ.45,173 కోట్లకు పెరిగాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల లావాదేవీల విలువ రూ.34,158 కోట్లకు, యాక్సిస్ బ్యాంక్ కార్డుల లావాదేవీలు రూ.21,729 కోట్లకు దూసుకెళ్లాయి. మరోవైపు ఎస్‌బీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ సెప్టెంబరులో నమోదైన రూ.24,966 కోట్ల నుంచి రూ.35,406 కోట్లకు ఎగబాకాయి. రుణసంస్థలు అక్టోబర్'లో 17లక్షల కార్డులివ్వగా, మొత్తం కార్డుల సంఖ్య 9.48కోట్లకు చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ - 1.91 కోట్లకు చేరగా, ఎస్‌బీఐ 1.87 కోట్లు, ఐసీఐసీఐ 1.6 కోట్లు, యాక్సిస్ 1.3 కోట్లకు చేరింది.