Credit Card: క్రెడిట్ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లు
క్రెడిట్ కార్డు ఎగవేతలు స్వల్పంగా పెరిగాయి. 2023 మార్చి ఆఖరుకు క్రెడిట్ కార్డు ఎగవేతలు రూ.4,072 కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం రుణాల్లో ఇది 1.94శాతానికి చేరుకుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (సహాయ) భగవత్ కరాడ్ పేర్కొన్నారు. క్రెడిట్ కార్డుల స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 2022 మార్చి ఆఖరి నాటికి రూ.3,122 కోట్లుగా ఉన్నాయన్నారు. 2022 మార్చి నాటికి రూ.1.64 లక్షల కోట్ల క్రెడిట్ బకాయిలున్నాయని, 2023 మార్చి ఆఖరికి రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వివరించారు. 2021 మార్చి ఆఖరుకు క్రెడిట్ కార్డుల ఎగవేతలు 3.56 శాతం ఉండగా, 2022 మార్చి నాటికి 1.91 శాతానికి పరిమితమైనట్లు వెల్లడించారు.
వారికి 12 నెలల వరకు లోన్ రాదు : కేంద్ర సహాయ మంత్రి కరాడ్
2023 మార్చి నాటికి 1.94 శాతంగా ఎగవేతలు పెరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు వాణిజ్య బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.87 శాతంగా ఉన్నాయన్నారు. 2022-23కి సంబంధించి సహకార బ్యాంకుల్లో 964 మోసాలను గుర్తించామని, రూ.791.40 కోట్ల మేర మోసాలను లెక్కించామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 729 మోసాలతో రూ.536.59 కోట్లు, అంతకుముందు ఏడాది 2020-21లో 438 మోసాలుతో రూ.1,985.79 కోట్ల లెక్కలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఇక 16,79,32,112ఖాతాల నుంచి క్లెయిమ్ చేసుకోని డబ్బు సుమారు రూ.48,461.44 కోట్లను డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేశామన్నారు. ఉద్దేశపూర్వకమైన ఎగవేతదార్లు(డిఫాల్టర్లు) రాజీ కోసం వచ్చినప్పటికీ, వారికి 12 నెలల వరకు కొత్తగా ఎలాంటి రుణం మంజూరు కాదని స్పష్టం చేశారు.