Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 5 శాతం పెరిగిన ధరలు,త్వరలో 120 డాలర్లకు?
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మరోసారి ఉధృతంగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు గ్లోబల్ ఆయిల్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతాయని, యుద్ధం ముగిసే సమయంపై ఎలాంటి గడువు నిర్ణయించలేదని ఆయన స్పష్టం చేయడంతో మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామాల మధ్య గురువారం (ఏప్రిల్ 2) ముడి చమురు ధరలు దాదాపు 5 శాతం వరకు ఎగబాకాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది. గురువారం MCXలో క్రూడాయిల్ ధరలు 5.66 శాతం పెరిగి బ్యారెల్‌కు రూ. 9,775 వద్ద ట్రేడయ్యాయి.
వివరాలు
ధరలు పెరగడానికి కారణాలేంటి?
గ్లోబల్ స్థాయిలో Brent Crude ధర బ్యారెల్‌కు 106.22 డాలర్లకు చేరగా, అమెరికా బెంచ్‌మార్క్ అయిన WTI Crude కూడా 4.2 శాతం పెరిగి 104.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్, ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలకు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చినా,ఖచ్చితమైన గడువు మాత్రం వెల్లడించలేదు. ఇదే సమయంలో ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే Strait of Hormuz భద్రతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మార్గాన్ని వినియోగించే దేశాలే దాని రక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
వివరాలు
ముడి చమురు ధరల భవిష్యత్ ఎలా?
ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఖతార్ ఎనర్జీ సంస్థ లీజుకు తీసుకున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు Reuters నివేదిక వెల్లడించింది. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే, ఇరాన్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశముందని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు మార్కెట్ కేవలం డిమాండ్-సరఫరా అంశాలపై కాకుండా భౌగోళిక రాజకీయ పరిణామాలపై కూడా ఆధారపడి కదులుతోంది. కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ నిపుణుడు అనింద్య బెనర్జీ ప్రకారం, బ్రెంట్ క్రూడ్‌కు 95-96 డాలర్ల వద్ద మద్దతు లభిస్తుండగా, రాబోయే రోజుల్లో ఇది 120 డాలర్లను తాకే అవకాశముంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ధరలు 95 నుంచి 110 డాలర్ల మధ్య ఉండే అవకాశం
అదే సమయంలో వెస్ట్‌పాక్ బ్యాంకింగ్ కార్పొరేషన్ విశ్లేషకుడు రాబర్ట్ రెన్నీ అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం హార్ముజ్ జలసంధి దాదాపు నెలరోజులుగా ప్రభావితమై ఉండటం వల్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితి మరికొన్ని వారాలు కొనసాగవచ్చని, దీంతో బ్రెంట్ క్రూడ్ ధరలు 95 నుంచి 110 డాలర్ల మధ్య ఉండే అవకాశముందని ఆయన అంచనా వేశారు.