Page Loader
small stocks: 2024లో స్మాల్  స్టాక్‌దే ఊపు..పెట్టుబడిదారులకు లాభాల పంట
2024లో స్మాల్ స్టాక్‌దే ఊపు..పెట్టుబడిదారులకు లాభాల పంట

small stocks: 2024లో స్మాల్  స్టాక్‌దే ఊపు..పెట్టుబడిదారులకు లాభాల పంట

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దలాల్‌ స్ట్రీట్‌లో ఈ ఏడాది స్మాల్‌ స్టాక్స్‌ అత్యంత మెరుగైన ప్రదర్శనను చూపాయి. స్మాల్‌,మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు విశేషమైన రాబడులు లభించాయి. దీనికి ప్రధాన కారణాలు స్టాక్‌ మార్కెట్‌పై ఉన్న ఆశావహ దృక్పథం, రిటైల్‌ ఇన్వెస్టర్ల పెరుగుతున్న భాగస్వామ్యం. దేశీయంగా వినియోగం పెరగడం, మౌలిక వసతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం తదితర అంశాలు వచ్చే ఏడాదిలోనూ వీటి ప్రగతికి సహకరించనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

పీఎల్‌ఐ స్కీమ్‌ కీలక పాత్ర 

డిసెంబర్‌ 23 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఈ ఏడాది బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 8.72 శాతం వృద్ధి చెంది 6299.91 పాయింట్ల లాభాన్ని సాధించింది. నిఫ్టీ కూడా 9 శాతం వృద్ధి నమోదుచేసింది.ఇదే సమయంలో బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 28.45 శాతం పెరిగి 12,144.15 పాయింట్లను చేరింది, మిడ్‌క్యాప్‌ సూచీ 25.61 శాతం వృద్ధితో 9,435.09 పాయింట్లు చేరింది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ ఇండెక్సుల రాణింపుకు వివిధ రంగాలలో వృద్ధి,ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు,మదుపర్ల తోడ్పాటు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రత్యేకంగా,పీఎల్‌ఐ స్కీమ్‌ వంటి ప్రభుత్వ చర్యలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయి. రియల్‌ ఎస్టేట్‌,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,హెల్త్‌కేర్‌,పునరుత్పాదక ఇంధన రంగాలకు చెందిన స్టాక్స్‌ ఈ సూచీలను మరింత ముందుకు నడిపించాయని వెల్లడించారు.

వివరాలు 

సిప్‌ పెట్టుబడుల రికార్డు స్థాయి వృద్ధి

అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు మెరుగైన ప్రదర్శన చూపాయని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పాల్కా అరోరా చోప్రా తెలిపారు. మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వడం, దేశీయ వినియోగం, ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. విదేశీ మదుపర్లు లాభాల స్వీకరణకు దిగినప్పుడు, దేశీయ సంస్థాగత మదుపర్లు మార్కెట్‌కు బలంగా నిలిచారని తెలిపారు. సిప్‌ పెట్టుబడుల రికార్డు స్థాయి వృద్ధి కూడా స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీల పురోగతికి కీలకమైంది. స్మాల్‌ స్టాక్స్‌ను ప్రధానంగా స్థానిక మదుపర్లే కొనుగోలు చేస్తుండగా, విదేశీ మదుపర్లు ఎక్కువగా బ్లూచిప్‌ స్టాక్స్‌పై మాత్రమే దృష్టి సారించడం కూడా కీలకాంశంగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.