India-US deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక మార్పులు.. ట్రేడ్ డీల్ ఫ్యాక్ట్‌షీట్‌ను సైలెంట్'గా సవరించిన వైట్ హౌస్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వైట్ హౌస్ విడుదల చేసిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఫ్యాక్ట్‌షీట్‌లో కీలక పదజాలాన్ని అమెరికా సైలెంట్'గా సవరించింది. ఫ్యాక్ట్‌షీట్ విడుదలైన కేవలం ఒక రోజులోనే ఈ మార్పులు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా, భారత్ అమెరికా ఉత్పత్తులను 500 బిలియన్ డాలర్లకు మించి కొనుగోలు చేయడానికి "కట్టుబడి ఉంది (commits)" అన్న వాక్యాన్ని,"కొనుగోలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉంది (intends)"గా మార్చడం గమనార్హం. దీంతో ఒప్పందంలోని ఒక కీలక అంశం స్వరూపమే మారిపోయింది. భారత్, అమెరికాలు పరస్పర ప్రయోజనాలతో కూడిన వాణిజ్య ఒప్పందానికి ఒక రూపరేఖను ప్రకటించిన కొన్ని రోజులకు, మంగళవారం వైట్ హౌస్ ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రధాన నిబంధనలను వివరించే ఫ్యాక్ట్‌షీట్‌ను విడుదల చేసింది.
వివరాలు
భారత్ మరిన్ని అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంది
అందులో, అమెరికా నుంచి వచ్చే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు, అనేక ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను రద్దు చేయడం లేదా తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాథమికంగా విడుదలైన ఫ్యాక్ట్‌షీట్‌లో, "భారత్ మరిన్ని అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంది. అలాగే, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర రంగాలకు చెందిన 500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది" అని స్పష్టంగా పేర్కొన్నారు.
వివరాలు
సవరించిన ఫ్యాక్ట్‌షీట్‌లో "కొన్ని రకాల పప్పుధాన్యాలు
అదేవిధంగా, ముందస్తు వెర్షన్‌లో "అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులన్నింటిపై, అలాగే విస్తృత స్థాయి అమెరికా ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను రద్దు చేస్తుంది లేదా తగ్గిస్తుంది" అని పేర్కొన్నారు. ఈ జాబితాలో డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్ (DDGs), రెడ్ సార్గమ్, డ్రై ఫ్రూట్స్, తాజా, ప్రాసెస్డ్ పండ్లు, కొన్ని రకాల పప్పుధాన్యాలు, సోయాబీన్ ఆయిల్, వైన్, మద్యం తదితర ఉత్పత్తులు ఉన్నాయి. కానీ సవరించిన ఫ్యాక్ట్‌షీట్‌లో "కొన్ని రకాల పప్పుధాన్యాలు (certain pulses)" అన్న అంశాన్ని ఈ జాబితా నుంచి తొలగించారు. మరొక కీలక మార్పు డిజిటల్ సేవల పన్నుల విషయంలో చోటుచేసుకుంది.
వివరాలు
ఈ వాక్యాన్ని పూర్తిగా తీసేశారు
తొలుత విడుదలైన ఫ్యాక్ట్‌షీట్‌లో, "భారత్ తన డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్‌ను తొలగిస్తుంది" అని, అలాగే "డిజిటల్ వాణిజ్యంలో వివక్షాత్మక లేదా భారమైన నిబంధనలను తొలగించేలా బలమైన ద్వైపాక్షిక డిజిటల్ ట్రేడ్ రూల్స్‌పై చర్చించేందుకు కట్టుబడింది" అని పేర్కొన్నారు. అయితే తాజా వెర్షన్‌లో "భారత్ డిజిటల్ సేవల పన్నులను తొలగిస్తుంది" అన్న వాక్యాన్ని పూర్తిగా తీసేశారు. కేవలం "బలమైన ద్వైపాక్షిక డిజిటల్ ట్రేడ్ నియమాలపై చర్చించేందుకు భారత్ కట్టుబడింది" అని మాత్రమే పేర్కొన్నారు. గత వారం భారత్, అమెరికాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి రూపరేఖను ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు అనేక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
వివరాలు
తగ్గిన సుంకాలు 18 శాతానికి
ఈ ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా, ప్రస్తుతం 50 శాతం వరకు ఉన్న భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 18 శాతానికి తగ్గించనుంది. దీనికి ప్రతిగా, అమెరికా నుంచి వచ్చే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు, విస్తృత స్థాయి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలను రద్దు చేయడం లేదా భారీగా తగ్గించడం జరగనుంది. ఇందులో డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్, జంతు ఆహారానికి ఉపయోగించే రెడ్ సార్గమ్, డ్రై ఫ్రూట్స్, తాజా ప్రాసెస్డ్ పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, మద్యం తదితర వస్తువులు ఉన్నాయి.
వివరాలు
భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాల తొలగింపు
ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం,వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ ఉత్పత్తులు, విమానాలు,వాటి విడిభాగాలు,విలువైన లోహాలు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ను భారత్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ ఒప్పందం ఖరారైన నేపథ్యంలో, గత ఏడాది ఆగస్టులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై విధించిన 25 శాతం అదనపు సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు.
వివరాలు
చమురు దిగుమతులు నిలిపివేస్తామని న్యూఢిల్లీ హామీ
భారత్ కీలకమైన చర్యలు చేపట్టిందని, ఇకపై మాస్కో నుంచి నేరుగా లేదా పరోక్షంగా చమురు దిగుమతులు నిలిపివేస్తామని న్యూఢిల్లీ హామీ ఇవ్వడమే ఇందుకు కారణమని అమెరికా పేర్కొంది. భారత్-అమెరికాల మధ్య తుది వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది మార్చి మధ్య నాటికి సంతకం కానుందని అధికార వర్గాలు తెలిపాయి.