Deepinder Goyal: జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ సీఈవో పదవికి దీపిందర్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో పాటు గ్రాసరీ దిగ్గజం బ్లింకిట్‌కు మాతృ సంస్థ అయిన ఎటర్నల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవోగా కొనసాగుతున్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా తెలియజేశారు. ఆయన రాజీనామా 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దీపిందర్ గోయల్ స్థానంలో బ్లింకిట్ సీఈవో అల్బీందర్ దిండ్సాను కొత్త సీఈవోగా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి అల్బీందర్ దిండ్సా ఎటర్నల్ సంస్థ సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
వివరాలు
వాటాదారులకు దీపిందర్ గోయల్ లేఖ
తన రాజీనామాకు కారణాలను దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో వివరించారు. ఇటీవల కాలంలో తాను అధిక రిస్క్‌తో కూడిన, ప్రయోగాత్మక ఆలోచనల వైపు ఎక్కువగా ఆకర్షితుడవుతున్నానని పేర్కొన్నారు. అయితే, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన ఎటర్నల్‌లో ఉండి అలాంటి ప్రయోగాలను కొనసాగించడం సముచితమని తాను భావించడం లేదని తెలిపారు. తన ఆలోచనలు కంపెనీ వ్యూహాలకు అనుగుణంగా ఉంటే సంస్థలోనే కొనసాగుతూ పనిచేసేవాడినని, కానీ ప్రస్తుతం తన ఆలోచనలు సంస్థ దిశకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని గోయల్ పేర్కొన్నారు. అందుకే సంస్థ నుంచి బయటకు వచ్చి, తన కొత్త కలలను నిజం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దీపిందర్ గోయల్ చేసిన ట్వీట్
An important update on leadership changes at Eternal. pic.twitter.com/CALn2QQFWE
— Deepinder Goyal (@deepigoyal) January 21, 2026