Dell: 5 రోజులుఆఫీస్ నుండి తప్పనిసరిగా పని చేయాల్సిందే.. ఉద్యోగులకు డెల్ సమాచారం
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from Home) విధానానికి వీడ్కోలు పలుకుతున్నాయి.
ఇప్పటికే అనేక సంస్థలు తమ ఉద్యోగులంతా కార్యాలయానికి రావాల్సిందిగా తుది సూచనలు జారీ చేశాయి.
తాజాగా, ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ (Dell) కూడా హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ మైఖేల్ డెల్ ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేశారని ఆంగ్ల మీడియా నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
కొత్త నిబంధనలు మార్చి 3వ తేదీ నుంచి అమలులోకి..
డెల్ కార్యాలయాల సమీపంలో నివసించే ఉద్యోగులు ఇకపై హైబ్రిడ్ లేదా రిమోట్ విధానంలో పని చేయలేరని, వారంలో ఐదు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందేనని మైఖేల్ డెల్ తన ఇ-మెయిల్‌లో స్పష్టం చేశారు.
ఈ కొత్త నిబంధనలు మార్చి 3వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
అయితే, ఈ నిబంధనలు కార్యాలయానికి సమీపంలో నివసించే ఉద్యోగులకే వర్తిస్తాయని తెలుస్తోంది.
చాలా దూరం నివసించే ఉద్యోగులు రిమోట్‌గా పని చేయాలంటే, సీనియర్ లీడర్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అదనంగా, అనుమతి లేకుండా రిమోట్ వర్క్ చేయాలనుకునే ఉద్యోగులకు భవిష్యత్తులో పదోన్నతులు ఉండవని తెలుస్తోంది.
ఇకపై కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు రిమోట్ వర్క్ అవకాశాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు డెల్ స్పష్టం చేసింది.
వివరాలు
ఐదు రోజులు కార్యాలయంలోనే పని చేయాలని ఆదేశం
కరోనాకు ముందే డెల్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమల్లో ఉండేది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ స్వయంగా దీన్ని ప్రోత్సహించేవారు.
అంతేకాకుండా, ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే సంస్థలను ఆయన విమర్శించేవారు.అయితే, ఇప్పుడు డెల్ తన విధానంలో కీలక మార్పులు చేసింది.
ఉద్యోగులు కలిసి పనిచేయడం,వారి ఆలోచనలను పంచుకోవడం సంస్థ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని భావించి, అందరూ కార్యాలయానికి రావాల్సిందేనని నిర్ణయించింది.
గత ఏడాది సెప్టెంబర్‌లోనే డెల్ తన గ్లోబల్ సేల్స్ బృందానికి వారంలో ఐదు రోజులు కార్యాలయంలోనే పని చేయాలని ఆదేశించింది.
ల్యాబ్ ఇంజినీర్లు,ఆన్-సైట్ సిబ్బంది,నాయకత్వ స్థాయిలో ఉన్న ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ నిబంధనలను అన్ని విభాగాలకు విస్తరించింది.