LOADING...
TATA group: టాటా ట్రస్ట్స్‌లో బయటపడ్డ తీవ్ర విభేదాలు.. ఛైర్మన్ నోయెల్ టాటాపై అసంతృప్తితో పలువురు ట్రస్టీలు
ఛైర్మన్ నోయెల్ టాటాపై అసంతృప్తితో పలువురు ట్రస్టీలు

TATA group: టాటా ట్రస్ట్స్‌లో బయటపడ్డ తీవ్ర విభేదాలు.. ఛైర్మన్ నోయెల్ టాటాపై అసంతృప్తితో పలువురు ట్రస్టీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

దశాబ్దాల పాటు టాటా ట్రస్ట్స్‌కు రతన్‌ టాటా ఛైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో ట్రస్ట్స్‌, ప్రధాన సంస్థ టాటా సన్స్‌ మధ్య అద్భుతమైన సమన్వయం నెలకొంది. రతన్‌ టాటా వ్యక్తిత్వం, ఆయన దౌత్యపూర్వక వైఖరి ఈ అనుబంధాన్ని బలపరిచాయి. అయితే ఆయన మరణంతో టాటా గ్రూప్‌లో అంతటి ప్రభావం చూపగల వ్యక్తి కొరతగా మారిందనే భావన వ్యక్తమవుతోంది. దేశంలో అత్యంత విలువైన కార్పొరేట్‌ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో ఇప్పుడు ఆధిపత్య పోరు మెల్లగా తలెత్తుతోందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని సమాచారం.

వివరాలు 

రతన్‌ టాటా తరువాత మారిన సమీకరణాలు 

రతన్‌ టాటా మరణానంతరం,గతేడాది అక్టోబరులో టాటా ట్రస్ట్స్‌కు నోయల్‌ టాటా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రతన్‌ టాటా కాలంలో ఆయన తీసుకునే నిర్ణయాలకు ట్రస్టీలు లేదా నామినీ డైరెక్టర్లు పెద్దగా వ్యతిరేకత చూపే పరిస్థితి ఉండేది కాదు. అయితే నోయల్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. ఆయనకు రతన్‌ టాటా స్థాయిలో అధికారాన్నివినియోగించే అవకాశం దక్కడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఇంటిపేరుతో నోయల్‌ నియామకాన్ని ఎవరూ అడ్డుకోకపోయినా,ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ ట్రస్టీలు జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. ముఖ్యంగా ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ కొన్ని కీలక నిర్ణయాలపై బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. మిస్త్రీ,టాటా సన్స్‌లో వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి సన్నిహితుడని తెలిసింది.

వివరాలు 

నామినీ డైరెక్టర్ల నియామకాలపై విభేదాలు 

టాటా సన్స్‌ బోర్డులో కొత్త డైరెక్టర్ల నియామకాల విషయంలో ట్రస్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. నోయల్‌ టాటా కొంతమంది పేర్లను సూచించగా, మిస్త్రీ వర్గం అందుకు మద్దతు ఇచ్చిందా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. సెప్టెంబరు 11న జరిగిన సమావేశంలో విజయ్‌ సింగ్‌ను నామినీ డైరెక్టర్‌గా తిరిగి నియమించడాన్ని నలుగురు ట్రస్టీలు వ్యతిరేకించినట్లు సమాచారం. టాటా సన్స్‌ బోర్డు సమావేశాల సమాచారం తాము సక్రమంగా అందుకోవడం లేదన్నదే వారి అభ్యంతరం. వేణు శ్రీనివాసన్‌ పునర్నియామకంపై కూడా చర్చ కొనసాగుతోంది. జీవితకాల నియామకాలపై పునరాలోచన అవసరమా అనే అంశం కూడా బోర్డులో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

టాటా సన్స్‌ లిస్టింగ్‌పై వివాదం 

మరొక కీలకమైన అంశం టాటా సన్స్‌ లిస్టింగ్‌. మిస్త్రీ కుటుంబానికి చెందిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. టాటా సన్స్‌లో ఈ గ్రూప్‌ కలిగిన 18.37 శాతం వాటాలను ఇప్పటికే తాకట్టు పెట్టింది. ఈ వాటాలను విడిపించుకోవడానికి టాటా సన్స్‌ లిస్టింగ్‌ చేయాలన్న డిమాండ్‌ను ఎస్‌పీ గ్రూప్‌ గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయమై వారు ప్రభుత్వానికి కూడా తమ అభిప్రాయాలను తెలిపారు. కానీ టాటా ట్రస్ట్స్‌ మొదటి నుంచీ లిస్టింగ్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నందున, నోయల్‌ టాటాకు ఇది సంక్లిష్టమైన సమస్యగా మారింది.

వివరాలు 

అక్టోబర్‌ 10 సమావేశంపై దృష్టి 

టాటా ట్రస్ట్స్‌లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ఇటీవల ట్రస్టీలను కలిసి వ్యూహాత్మక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న జరగనున్న టాటా ట్రస్ట్స్‌ బోర్డు సమావేశం అత్యంత కీలకంగా మారింది. గ్రూప్‌లోని వివాదాస్పద అంశాలపై ఈ సమావేశంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్ని వర్గాలనూ ఒక తాటిపైకి తీసుకువచ్చే సవాలును నోయల్‌ టాటా ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వ జోక్యం! 

టాటా గ్రూప్‌ అంతర్గత విభేదాలు ఎక్కువవుతుండటంతో, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయల్‌ టాటా, టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ త్వరలోనే కేంద్రంలోని సీనియర్‌ అధికారులను కలిసి చర్చించనున్నారని ఓ ఆంగ్ల వార్తా సంస్థ నివేదించింది. బోర్డు రూమ్‌లలో ఉద్భవించిన ఈ తగాదాలను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వ జోక్యం అవసరమవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.