Digital Arrest: డిజిటల్ అరెస్ట్.. కొత్త తరహా సైబర్ మోసాల పెనుముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్ది, సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు.
ఈ తరహా కొత్త మోసాలలో ఒకటి 'డిజిటల్ అరెస్ట్'. ఇది సైబర్ మోసాలలోని అత్యంత ప్రమాదకరమైన పద్ధతిగా మారింది.
ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని వల్ల మోసపోవడం ఎలా జరగుతుంది? ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవడం ఎలానో తెలుసుకుందాం.
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
డిజిటల్ అరెస్ట్ మోసం, వ్యక్తులను భయపెట్టి డబ్బు వసూలు చేసే ఒక విధానం.
ఈ పద్ధతిలో, మోసగాళ్లు మీకు ఫోన్ చేసి, అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్టులు, లేదా ఇతర నిషేధిత వస్తువులు మీ పేరుతో పార్సిల్‌లో వచ్చినట్లు చెబుతారు.
Details
డబ్బులు ఇవ్వొద్దు
ఈ విషయం నేరంగా పరిగణించి, మీపై చర్యలు తీసుకుంటామని, మీరు కూడా ఈ అక్రమ కార్యకలాపాలలో పాలుపంచుకున్నట్లు చెబుతూ, మిమ్మల్ని భయపెడతారు.
ఇలాంటి సందర్భంలో కేసు రాజీ చేయడానికి డబ్బు డిమాండ్ చేస్తారు.
డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎలా పనిచేస్తుంది?
మోసగాళ్లు తమను ప్రభుత్వ అధికారులు, చట్ట అమలు చేసే సంస్థల ప్రతినిధులుగా ప్రకటించి, మీపై నేరారోపణలు ఉన్నట్లు చెప్పి, వాటిని నివారించడానికి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు.
ఇటువంటి కాల్స్‌లో వ్యక్తులను భయపెట్టి, అవాస్తవమైన నేరారోపణలతో మోసగాళ్ల వలలో పడేటట్లు చేస్తారు.
వ్యక్తి నమ్మిన వెంటనే, భారీగా డబ్బు పోగొట్టుకునే ప్రమాదంలో ఉంటారు.
Details
ఇలాంటి కాల్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1)భయపడకండి
అపరిచితుల నుండి వచ్చే కాల్స్‌లో భయపడకుండా, ప్రశాంతంగా వ్యవహరించండి.
2) వివరాలు అడగండి
మిమ్మల్ని నేరారోపణలు చేస్తున్న వారు నిజమైన అధికారులైతే వారు పూర్తి వివరాలు చెప్పడం తప్పనిసరి. ఎటువంటి క్షణిక నిర్ణయాలు తీసుకోకుండా వారిని ప్రశ్నించండి.
3) డబ్బు ఇవ్వకండి
ఎవరు డబ్బు అడిగినా, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.
4) ప్రజా చైతన్యం
ప్రభుత్వం తరచుగా ఇటువంటి మోసాలను అరికట్టేందుకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ హెచ్చరికలను పాటించండి.
Details
సైబర్ మోసాల పట్ల ప్రభుత్వం చర్యలు
సైబర్ మోసాల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
ప్రజలు ఈ స్కాముల నుండి రక్షణ పొందేందుకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ఒక ఆడియో క్లిప్‌ను కూడా విడుదల చేసింది.
సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినా భయపడకుండా సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.