SBI research report: యూపీఐ రికార్డుల మధ్య.. రూ.40 లక్షల కోట్లకు చేరిన చలామణి నగదు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ప్రజల్లో నగదు వినియోగం కూడా అదే సమయంలో పెరుగుతుండటం గమనార్హం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలు సంఖ్యలోను, విలువలోను కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. అయినప్పటికీ, 2026 జనవరి చివరి నాటికి చలామణిలో ఉన్న నగదు మొత్తం చరిత్రలోనే అత్యధికంగా రూ.40 లక్షల కోట్లకు చేరిందని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదిక స్పష్టం చేసింది. అయితే గత అయిదేళ్లను పరిశీలిస్తే, స్థూల దేశీయోత్పత్తితో పోల్చినప్పుడు నగదు వినియోగ నిష్పత్తి 14.4 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మారుతున్న విధానాన్ని ప్రతిబింబిస్తోందని నివేదిక పేర్కొంది.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో అధికంగా రూ.100 నోట్ల వినియోగం:
కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పెరుగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ ధోరణి క్రమంగా తగ్గుతోంది. 2022-23లో ఏపీలో ఒక్కో ఏటీఎం నుంచి నెలకు సగటున రూ.1.57 కోట్లు నగదు విత్‌డ్రా అయ్యేది. అయితే 2025-26 డిసెంబరు నాటికి ఇది రూ.1.34 కోట్లకు పడిపోయింది. దీని ద్వారా డిజిటల్ లావాదేవీల వినియోగం పెరిగినట్టు స్పష్టమవుతోంది. సాధారణంగా డిజిటల్ చెల్లింపులు విస్తరించినప్పుడు తక్కువ విలువైన నోట్ల వినియోగం తగ్గాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రూ.100 నోట్ల వినియోగం మరింత పెరుగుతోంది. అదే సమయంలో తమిళనాడులో రూ.200 నోట్ల వినియోగం అధికంగా కనిపిస్తోంది.
వివరాలు
నగదు లావాదేవీలు ఎందుకు పెరుగుతున్నాయి?
కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ చిన్న వ్యాపారులు, చిరు విక్రేతలకు సుమారు 18,000కు పైగా జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. ఈ చర్యల వల్ల డిజిటల్ చెల్లింపులపై వ్యాపారుల్లో భయం పెరిగి, మళ్లీ నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది. అలాగే బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం కూడా మార్కెట్లో నగదు లభ్యత పెరగడానికి మరో ప్రధాన కారణంగా మారింది. చాలా మంది గృహస్థులు తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారు.
వివరాలు
రూ.500 నోట్ల ఆధిపత్యం కొనసాగుతోంది
యూపీఐ ప్రధానంగా రూ.100, రూ.200 వంటి చిన్న విలువ గల నోట్లకు ప్రత్యామ్నాయంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. అయితే రూ.500 నోట్ల వినియోగాన్ని అది తగ్గించలేకపోయింది. వాస్తవానికి యూపీఐ లావాదేవీలలో రూ.500 కంటే తక్కువ మొత్తాలే దాదాపు 86 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ కారణంగానే మార్కెట్లో ఇప్పటికీ రూ.500 నోట్ల ఆధిపత్యం కొనసాగుతోందని ఎస్‌బీఐ రీసెర్చ్ విశ్లేషించింది.