Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..291 పాయింట్లు జంప్ చేసిన సెన్సెక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో నమోదైన నష్టాల నుంచి కోలుకున్న భారత స్టాక్ మార్కెట్, ఈ వారం తొలి ట్రేడింగ్ రోజు అయిన సోమవారం (జూన్ 22) లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల నుంచి లభించిన మద్దతుతో దలాల్ స్ట్రీట్ ప్రారంభం నుంచే పటిష్ఠ ధోరణి కనబరిచింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు 0.38శాతం మేర లాభాలను నమోదు చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు చెందిన నిఫ్టీ-50 సూచీ నేటి ట్రేడింగ్‌లో 89.80పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 24,102.90 వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 291.17 పాయింట్లు లేదా 0.38శాతం లాభపడి 77,094.07 వద్ద స్థిరపడింది.
వివరాలు
గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో ప్రారంభమైన మార్కెట్
ఈ ఉదయం మార్కెట్లు గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిఫ్టీ 24,106.60 వద్ద, సెన్సెక్స్ 77,160.67 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 24,168.05 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకగా, సెన్సెక్స్ 77,325.56 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే ట్రేడింగ్ చివరి గంటలో కొంత ఒడుదొడుకులు కనిపించాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గుచూపడంతో సూచీలు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ, కీలక మద్దతు స్థాయిలను కాపాడుకుంటూ గ్రీన్ జోన్‌లోనే ముగిశాయి.
వివరాలు
మార్కెట్ లాభాలకు కారణాలివే
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల్లో పురోగతి కనిపిస్తోందన్న వార్తలు ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత మేర తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగుపడింది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువన కొనసాగడం కూడా భారత మార్కెట్లకు మద్దతు ఇచ్చింది. గత శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ రంగం ఈరోజు కోలుకుంది. ముఖ్యంగా సిప్లా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి షేర్లు మార్కెట్‌కు బలాన్ని అందించాయి. అలాగే ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు కూడా మెరుగైన ప్రదర్శన కనబరచడంతో సూచీలు లాభాల్లో నిలిచాయి.