Page Loader
EPFO: పీఎఫ్ సేవలకు ఏజెంట్లపై ఆధారపడద్దు.. ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక!
పీఎఫ్ సేవలకు ఏజెంట్లపై ఆధారపడద్దు.. ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక!

EPFO: పీఎఫ్ సేవలకు ఏజెంట్లపై ఆధారపడద్దు.. ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తమ సభ్యులకు ఒక కీలక సూచన చేసింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) సంబంధిత సేవల కోసం ఎటువంటి మూడవ పక్షాల (థర్డ్ పార్టీ) సాయాన్ని ఆశ్రయించవద్దని స్పష్టంగా హెచ్చరించింది. ఇతరుల సహాయం తీసుకోవడం ద్వారా వ్యక్తిగత సమాచారం,ఆర్థిక డేటా దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందని ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో,సేవల కోసం ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని,అన్ని సేవలు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అధికారిక ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ (www.epfindia.gov.in) లేదా ఉమాంగ్ (UMANG) మొబైల్ యాప్‌ ద్వారా నేరుగా సేవలను పొందాలని చందాదారులకు సూచించింది. ఈ విధానాలు వేగవంతంగా, పారదర్శకంగా, భద్రంగా ఉంటాయని సంస్థ పేర్కొంది.

వివరాలు 

వ్యక్తిగత డేటా గోప్యతకు హానికరంగా మారే అవకాశం

ఇటీవల కార్మిక శాఖ దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం,కొన్ని సైబర్ కేఫేలు,కొంతమంది ఫిన్‌టెక్ సంస్థలు ఈపీఎఫ్‌ఓ సేవలను అందిస్తామంటూ సభ్యుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వాస్తవానికి ఉచితంగా లభించే ఈ సేవలకే డబ్బులు తీసుకుంటున్నారని కార్మిక శాఖ పేర్కొంది. అంతేకాక,ఇటువంటి మూడవ పక్షాల ద్వారా సేవలు పొందడం వల్ల వ్యక్తిగత డేటా గోప్యతకు హానికరంగా మారే అవకాశం ఉందని హితవు పలికింది. ఈపీఎఫ్‌ఓకి ఏవిధమైన అంగీకృత థర్డ్ పార్టీ సంస్థలు లేవని సంస్థ స్పష్టంచేసింది. సభ్యులు,ఉద్యోగదారులు,పెన్షనర్లు తమ పీఎఫ్ సంబంధిత సేవలు.. క్లెయిమ్ సెటిల్మెంట్,కేవైసీ అప్‌డేట్‌లు,ఫిర్యాదుల పరిష్కారాలు మొదలైనవాటిని అధికారిక వెబ్‌సైట్‌గానీ,ఉమాంగ్ యాప్‌గానీ ఉపయోగించి పొందాలని ఈపీఎఫ్‌ఓ సూచించింది.

వివరాలు 

ఈపీఎఫ్‌ఓ ఇటీవల చేసిన కొన్ని ముఖ్యమైన మార్పులు: 

ఏదైనా సమస్య ఎదురైతే, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న హెల్ప్‌డెస్క్ ద్వారా సహాయం పొందవచ్చని కూడా తెలిపింది. ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్: అనారోగ్యం, వివాహం, విద్య అవసరాల కోసం తీసుకునే అడ్వాన్స్ పరిమితి రూ.1 లక్షకు పెంచబడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విధానం ద్వారా సుమారు 2.34 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు వెల్లడించింది. ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ ప్రక్రియ సులభతరం: 2025 జనవరి 15 నుంచి పీఎఫ్ ఖాతా బదిలీకి యాజమాన్యం ఆమోదం అవసరం లేకుండా మార్పులు తీసుకొచ్చారు. ఆధార్ ఆధారిత నవీకరణలు: ఆధార్ అథంటికేషన్ సాయంతో ప్రొఫైల్‌లో అవసరమైన మార్పులను చందాదారులే స్వయంగా చేయుకునే వెసులుబాటు కల్పించబడింది. దీని వల్ల యజమానిపై ఆధారపడాల్సిన అవసరం తక్కువైంది.

వివరాలు 

ఈపీఎఫ్‌ఓ ఇటీవల చేసిన కొన్ని ముఖ్యమైన మార్పులు: 

ఫేస్ అథంటికేషన్ టెక్నాలజీ: ఉమాంగ్ యాప్‌లో ఫేస్ గుర్తింపు ద్వారా యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) కేటాయింపు, యాక్టివేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. బ్యాంక్ వివరాల అనుసంధానం: బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేసేందుకు ఇంతకు ముందు అవసరమైన చెక్ లీఫ్ లేదా అటెస్ట్ చేసిన పాస్‌బుక్‌ను అప్‌లోడ్ చేయాల్సిన నిబంధన తొలగించారు. అంతేకాక, యజమానుల అనుమతి కూడా ఇకపై అవసరం లేదు.