Page Loader
Tuhin Kanta Pandey: మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా చర్యలు… జేన్‌ స్ట్రీట్‌ వ్యవహారంపై సెబీ ఛైర్మన్‌ స్పందన
మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా చర్యలు… జేన్‌ స్ట్రీట్‌ వ్యవహారంపై సెబీ ఛైర్మన్‌ స్పందన

Tuhin Kanta Pandey: మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా చర్యలు… జేన్‌ స్ట్రీట్‌ వ్యవహారంపై సెబీ ఛైర్మన్‌ స్పందన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్ మార్కెట్‌లో అమెరికాకు చెందిన హెడ్జ్ ఫండ్ "జేన్ స్ట్రీట్‌" అక్రమ కార్యకలాపాల ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జించిన ఘటనపై, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) చైర్మన్‌ తుహిన్‌కాంత పాండే తొలిసారిగా స్పందించారు. ఇకపై అలాంటి చట్టవ్యతిరేక చర్యలు చోటు చేసుకోనివ్వమని ఆయన స్పష్టం చేశారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై తమ దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయనకు, జేన్ స్ట్రీట్ ఉదంతానికి సంబంధించి ప్రశ్న ఎదురవగా, "ఇలాంటి మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ వ్యవహారంలో నిఘా వ్యవస్థలోని లోపాలవైపు కూడా దృష్టి సారిస్తున్నాం," అని వివరించారు.

వివరాలు 

రూ.4,843కోట్ల జరిమానా

ఇటీవలే సెబీ సంస్థ జేన్‌ స్ట్రీట్‌ గ్రూపుపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. భారత మార్కెట్లలో చట్టవ్యతిరేకంగా వ్యవహరించినందుకు గాను సెబీ ఈ సంస్థపై శుక్రవారం నిషేధం విధించింది. సంస్థ దాదాపు రూ.44,358కోట్లు నిబంధనలు ఉల్లంఘించి సంపాదించిందని సెబీ దర్యాప్తులో తేలింది. ఈ మొత్తంలో,స్టాక్ ఫ్యూచర్స్ విభాగంలో సంస్థకు రూ.7,208 కోట్లు,ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ.191 కోట్లు, అలాగే నగదు విభాగంలో రూ.288 కోట్ల నష్టాలు ఎదురైనట్లు గుర్తించారు. ఈనష్టాలను మినహాయించిన తరువాత,సంస్థ మొత్తం లాభం రూ.36,671 కోట్లు ఉంటుందని సెబీ పేర్కొంది. అంతేగాక,ఇందులో భాగంగా రూ.4,843కోట్ల జరిమానా విధిస్తూ సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ మార్కెట్ల చరిత్రలో ఇదే తొలి సారి ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడం గమనార్హం.