Draft income tax rules: డ్రాఫ్ట్ ఐటీ రూల్స్ విడుదల.. పాన్ పరిమితులు భారీగా పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 7న కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను విడుదల చేసింది. ఈ నిబంధనల ద్వారా పాన్(PAN Card)తప్పనిసరి అయ్యే లావాదేవీల ఆర్థిక పరిమితులను కేంద్ర ప్రభుత్వం పెంచాలని సూచించింది." కొత్త నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమలు లేదా ఉపసంహరణలు మొత్తం కలిపి రూ.10లక్షలు లేదా అంతకన్నా ఎక్కువైతేనే పాన్ తప్పనిసరి అవుతుంది. ఇప్పటివరకు ఒకే రోజులో రూ.50 వేలకుపైగా నగదు జమ చేస్తే పాన్ ఇవ్వాల్సి ఉండేది. అలాగే మోటారు వాహనాల కొనుగోలులోనూ మార్పులు సూచించారు.
వివరాలు
రూ.1 లక్షలోపు హోటల్ బిల్లులకు పాన్ అవసరం లేదు
ఇప్పటివరకు రూ.5 లక్షలకుపైగా విలువైన వాహనం కొనుగోలు చేస్తే పాన్ అవసరం కాగా, కొత్త నిబంధనలతో వాహనం ధర ఎంతైనా సరే పాన్ తప్పనిసరి అవుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్ లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవల కోసం చేసే చెల్లింపుల్లో బిల్ మొత్తం రూ.1 లక్షలు దాటితేనే పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50 వేలుగా ఉంది.ఇక స్థిరాస్తి కొనుగోలు,అమ్మకం,బహుమతి లేదా జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాల విషయంలో పాన్ తప్పనిసరి పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు.
వివరాలు
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు
బీమా కంపెనీలతో ఖాతా ఆధారిత సంబంధం ప్రారంభించాలన్నా పాన్ తప్పనిసరి చేయనున్నారు. అలాగే క్రిప్టో ఎక్స్చేంజీలు ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలన్న నిబంధనను కూడా డ్రాఫ్ట్‌లో చేర్చారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)ని ఎలక్ట్రానిక్ చెల్లింపుల రూపంగా గుర్తించారు. బడ్జెట్ 2026 ప్రకటన తర్వాత విడుదలైన ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై ప్రజల నుంచి సూచనలు తీసుకున్న తర్వాత, కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.