LOADING...
Dream11: డ్రీమ్‌ మనీతో స్టాక్‌ బ్రోకింగ్‌లోకి.. డ్రీమ్‌ 11  
డ్రీమ్‌ మనీతో స్టాక్‌ బ్రోకింగ్‌లోకి.. డ్రీమ్‌ 11

Dream11: డ్రీమ్‌ మనీతో స్టాక్‌ బ్రోకింగ్‌లోకి.. డ్రీమ్‌ 11  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫారమ్‌ డ్రీమ్‌ 11 ఇప్పుడు కొత్త రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ స్టాక్‌ బ్రోకింగ్‌,వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవల రంగంలోకి ప్రవేశించబోతోందని సమాచారం. దీనికోసం ఇప్పటికే అవసరమైన లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 'మింట్‌' పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం, 'డ్రీమ్‌ మనీ' అనే పేరుతో స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలను ప్రారంభించే ప్రయత్నంలో కంపెనీ ఉంది. ఈ క్రమంలో జెరోధా, ఏంజెల్‌ వన్‌, గ్రో వంటి ప్రముఖ డిస్కౌంట్‌ బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫారమ్‌లకు పోటీగా నిలిచే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం కారణంగా డ్రీమ్‌ 11 తన రియల్‌ మనీ గేమ్స్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.

వివరాలు 

వ్యాపార విస్తరణలో భాగంగా స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల్లోకి..

దీని ప్రభావంతో కంపెనీ ఆదాయం దాదాపు 95 శాతం వరకు తగ్గిపోయింది. అనంతరం ఫ్రీ-టు-ప్లే, యాడ్‌ ఆధారిత మోడల్‌ వైపు మారినా, అందులోనుంచి పెద్దగా లాభం రాలేదు. అందువల్ల వ్యాపార విస్తరణలో భాగంగా స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల్లోకి ప్రవేశించాలనే నిర్ణయానికి డ్రీమ్‌ 11 వచ్చింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్‌కు 26 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. వీరిని ఇప్పుడు రిటైల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మార్కెట్‌ వైపు మళ్లించాలన్న ఉద్దేశ్యంతో ఈ కొత్త వ్యూహాన్ని రూపొందించింది. ప్రస్తుతం భారతదేశంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం స్టాక్‌ మార్కెట్‌లో వేగంగా పెరుగుతోంది.

వివరాలు 

జీరో కమీషన్‌ ట్రేడింగ్‌ వంటి సదుపాయాలు

మార్కెట్లోకి సులభంగా ప్రవేశించే అవకాశాలు, జీరో కమీషన్‌ ట్రేడింగ్‌ వంటి సదుపాయాలు ఈ వృద్ధికి కారణమయ్యాయి. అయినప్పటికీ, ప్రతి 12 మందిలో కేవలం ఒకరే ఇన్వెస్టర్‌గా ఉన్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. అంటే, మార్కెట్‌కు దూరంగా ఉన్న ప్రజల సంఖ్య ఇప్పటికీ అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో, కొత్త అవకాశాల కోసం డ్రీమ్‌ 11 స్టాక్‌ మార్కెట్‌ రంగంలో అడుగుపెట్టడం సహజమైన నిర్ణయంగా కనిపిస్తోంది.