Gold imports: సుంకాల పెంపుతో దుబాయ్ నుంచి భారత్‌కు పెరగనున్న బంగారం దిగుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
పసిడి కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15శాతానికి పెంచింది. అయితే ఈ నిర్ణయం వల్ల బంగారం దిగుమతులు తగ్గకపోగా,దుబాయ్ మార్గం ద్వారా భారత్‌కు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వాణిజ్య విశ్లేషణ సంస్థ జీటీఆర్‌ఐ వెల్లడించింది. భారత్-యూఏఈ మధ్య అమల్లో ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కారణంగా దుబాయ్ నుంచి వచ్చే బంగారంపై ప్రత్యేక రాయితీలు అమలులో ఉన్నాయి. సాధారణంగా బంగారంపై 15శాతం దిగుమతి సుంకం ఉండగా,ఒప్పందం కింద నిర్దిష్ట కోటా పరిధిలో దిగుమతి అయ్యే బంగారంపై 14శాతం మాత్రమే సుంకం విధిస్తున్నారు. ఈ ఒక శాతం తేడానే వ్యాపారులను దుబాయ్ మార్గం వైపు మళ్లించే అవకాశముందని జీటీఆర్‌ఐ పేర్కొంది.
వివరాలు
వెండి దిగుమతులు కూడా దుబాయ్ మార్గంలో గణనీయంగా పెరిగే అవకాశం
2022లో దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన బంగారం దిగుమతులు సుమారు 120 టన్నులుగా ఉండగా, 2027 నాటికి అవి 200 టన్నులకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం బంగారంలో నాలుగో వంతు దుబాయ్ నుంచే రావచ్చని తెలిపింది. వెండి విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని జీటీఆర్‌ఐ అభిప్రాయపడింది. ప్రస్తుతం వెండిపై సాధారణ దిగుమతి సుంకం 15 శాతం ఉండగా, దుబాయ్ నుంచి వచ్చే వెండిపై ఒప్పందం ప్రకారం కేవలం 7 శాతం మాత్రమే సుంకం అమలులో ఉంది. ఈ 8 శాతం వ్యత్యాసం కారణంగా వెండి దిగుమతులు కూడా దుబాయ్ మార్గంలో గణనీయంగా పెరిగే అవకాశముందని పేర్కొంది.
వివరాలు
వెండిపై సుంకం పూర్తిగా సున్నా శాతానికి చేరుకునే అవకాశం
2031 నాటికి ఈ ఒప్పందం కింద వెండిపై సుంకం పూర్తిగా సున్నా శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసే సుంకాల నోటిఫికేషన్లు చాలా క్లిష్టంగా ఉన్నాయని జీటీఆర్‌ఐ విమర్శించింది. అనేక సవరణలను పరిశీలించిన తర్వాత మాత్రమే అసలు పన్ను ఎంత అన్నది అర్థమయ్యే పరిస్థితి నెలకొందని, విధానాలను మరింత సులభంగా మార్చాల్సిన అవసరం ఉందని సూచించింది.