Anil Ambani: అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి రిలయెన్స్ గ్రూప్‌పై సడన్ దాడులు చేసింది. రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ 'అనిల్ అంబానీ', ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్ కంపెనీలు, అనుబంధ సంస్థలకు చెందిన రూ.7,545 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. అయితే ఈ అంశంపై అంబానీ లేదా ఆయన గ్రూప్ కంపెనీల నుండి ఎటువంటి స్పందన రాలేదు.
Details
అటాచ్ చేసిన ఆస్తుల వివరాలు
ఈడీ అక్టోబర్ 31న నాలుగు తాత్కాలిక ఆదేశాలను జారీ చేస్తూ మొత్తం 42 ఆస్తులను అటాచ్ చేసింది. ముంబయిలోని పాలిహిల్‌లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, ఆయన గ్రూప్ కంపెనీలకు చెందిన నివాస, వాణిజ్య భవనాలు, హైదరాబాద్‌లోని కామస్ కాప్రి అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ఆస్తులు, అలాగే ముంబయి, నోయిడా, ఢిల్లీ, థానే, పుణె, చెన్నై, ఘజియాబాద్‌లోని భవనాలు, స్థలాలు కూడా ఇందులో ఉన్నాయి. తాజాగా ఈడీ నవీ ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (DAKC)కి చెందిన 32 ఎకరాలను అటాచ్ చేస్తూ ఐదో ఆదేశం జారీ చేసింది. దీని విలువ మాత్రమే రూ.4,462 కోట్లు.
Details
కేసు నేపథ్యం ఇదే
ఈడీ దర్యాప్తు ప్రకారం రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (RCFL) సంస్థలు ప్రజల నుంచి సమీకరించిన నిధులను అక్రమంగా ఇతర గ్రూప్ కంపెనీలకు మళ్లించాయి. 2017-19 మధ్య యెస్ బ్యాంక్ RHFLలో రూ.2,935 కోట్లు, RCFLలో రూ.2,045 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. కానీ 2019 నాటికి ఆ పెట్టుబడులు నిరర్థక ఆస్తులుగా మారాయి. RHFLకు రూ.1,353.40 కోట్లు, RCFLకు రూ.1,984 కోట్లు బకాయిలుగా మిగిలిపోయాయి. ఈ డబ్బులను అదే గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు రుణాలుగా మళ్లించారని ఈడీ తెలిపింది.
Details
ఆర్‌కామ్ (Reliance Communications) దర్యాప్తు వేగవంతం
ఈడీ అధికారులు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM), అనుబంధ సంస్థలు రూ.13,600 కోట్ల రుణాలను గ్రూప్‌లోనే మళ్లించాయని గుర్తించారు. మొత్తం మీద రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర అనుబంధ సంస్థలు రూ.17,000 కోట్లకు పైగా నిధుల మళ్లింపులో పాత్ర వహించినట్లు అనుమానం వ్యక్తమైంది. ఈ కేసులో భాగంగా ఈడీ గత జూలై 24న 35 ప్రదేశాల్లో సోదాలు, 25 మంది వ్యక్తుల ఇళ్లలో, కార్యాలయాల్లో దర్యాప్తు జరిపింది. ఆ తర్వాత ఆగస్టులో అనిల్ అంబానీని విచారించింది.
Details
అదనపు వివరాలు
FEMA (Foreign Exchange Management Act) కింద విడిగా జరిగిన దర్యాప్తులో, జయపుర-రీంగస్ హైవే ప్రాజెక్టు నుంచి రూ.40 కోట్లు మళ్లింపైనట్లు ఈడీ తెలిపింది. సూరత్‌లోని షెల్ కంపెనీల ద్వారా దుబాయ్‌కి నిధులు పంపించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. హవాలా మార్గంలో రూ.600 కోట్ల వరకు నిధులు విదేశాలకు తరలించబడినట్లు ఈడీ వెల్లడించింది. 2010-12 మధ్య రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుంది, కానీ వాటిలో చాలా 'నిరర్థక' ఆస్తులుగా మారాయి. ప్రస్తుతం రూ.19,694 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఆర్‌కామ్ రుణ ఖాతాలను బ్యాంకులు 'మోసపూరిత' (Fraud) కేటగిరీలో వర్గీకరించాయని ఈడీ స్పష్టం చేసింది.