FEMA ఉల్లంఘనల కేసులో రూ.9,000కోట్లు చెల్లించాలని బైజూస్‌కు ఈడీ నోటుసులు
ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's) గట్టి షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9,000 కోట్లు చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం బైజూస్ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) కింద ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అయితే ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వస్తున్న వార్తలపై బైజూస్ స్పందించింది. ఈ వార్తలను కంపెనీ ఖండించింది. ఈడీ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని, తాము ఎలాంటి అవకతవలకు పాల్పడలేదని వివరించింది.
బైజూస్ కార్యాలయాల్లో సోదాల అనంతరం ఫెమా ఆరోపణలు
బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీందరన్, అతని కంపెనీకి సంబంధించిన లావాదేవీ కేసులో బెంగళూరులోని 3 ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. బైజూస్ 2011-2023 మధ్య కాలంలో దాదాపు రూ.28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) పొందినట్లు ఆ సోదాల్లో తెలిసింది. ఆ మొత్తంలో దాదాపు 9,754 కోట్ల లావాదేవీల విషయంలో FEMA నిబంధనలను బైజూస్ ఉల్లంఘించినట్లు ఈడీ అభియోగాలు మోపింది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.