Edible oil price hike : సామాన్యుడిపై మరింత భారం!.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
పండుగ సీజన్‌లో సామాన్యులపై ధరల భారం మరింత పెరుగుతోంది. వంట నూనెల ధరలు గత నెల రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. పామాయిల్ ధరలు ఏకంగా 37 శాతం పెరిగి, గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి! వంటింట్లో ఎక్కువగా వాడే ఆవ నూనె ధర సైతం 29 శాతం పెరిగింది. దీని ఫలితంగా రెస్టారెంట్లు, హోటల్స్, స్వీట్ షాపులు కూడా తమ మెనూ ధరలను పెంచక తప్పడం లేదు, అందువల్ల సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి.
ధరలు పెరగడానికి కారణాలు
సెప్టెంబర్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతానికి పెరగడం, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడం వంట నూనెల ధరలను పెంచడానికి ప్రధాన కారణం. పామ్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచడంతో, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ పామ్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం పెరిగాయి. సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెపై దిగుమతి సుంకం 5.5 శాతం నుండి 27.5 శాతానికి పెంచింది.
భవిష్యత్తులో ధరల ప్రభావం
భారతదేశం వంట నూనెల దిగుమతుల్లో రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న కారణంగా, 58 శాతం నూనెలు దిగుమతుల ద్వారానే పొందుతుంది. అధికారులు ఈ ధరలు తక్కువ కాలంలో తగ్గే అవకాశాలు కనిపించడం లేదని భావిస్తున్నారు. వేరుశనగ, సోయాబీన్ పంటలు త్వరలో మార్కెట్లోకి రానుండటంతో దిగుమతి సుంకాలను తగ్గించే యోచన ప్రభుత్వం వద్ద లేదు.
ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రభావం
కాఫీ, టీ ధరలతో పాటు వంటనూనెల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. ఈ ఏడాది కాఫీ ధరలు 60 శాతం, టీ ధరలు 25 శాతం పెరిగాయి. టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే త్రైమాసికంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాయి.