Eli Lilly- Alzheimer: ఎలీ లిల్లీ అల్జీమర్స్ ఔషధానికి సీడీఎస్‌సీఓ ఆమోదం..
ఈ వార్తాకథనం ఏంటి
అల్జీమర్స్ చికిత్స కోసం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) అభివృద్ధి చేసిన కొత్త ఔషధానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అధికారిక అనుమతి ఇచ్చింది. డోననేమాబ్ (4350 ఎంజీ/20 ఎంఎల్) అనే ఈ మందును భారత మార్కెట్‌లో విక్రయించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదం మంజూరు చేసినట్లు కంపెనీ మంగళవారం వెల్లడించింది. అల్జీమర్స్ ప్రారంభ దశలో ఉన్న పెద్దలకు ఈ ఔషధాన్ని ప్రతి నాలుగు వారాలకు ఒకసారి ఇంట్రావీనస్ (ఐవీ) ఇన్ఫ్యూషన్ రూపంలో అందించాల్సి ఉంటుందని పేర్కొంది. స్వల్ప మతిమరుపు ఉన్న వారికి కూడా ఈ మందు ఉపయోగకరంగా పనిచేస్తుందని తెలిపింది.
వివరాలు
2030 నాటికి దేశంలో దాదాపు 80 లక్షల మందికి మతిమరుపు
భారతదేశంలో అల్జీమర్స్ రోగుల అవసరాలను తీర్చాలన్న తమ లక్ష్యానికి ఈ అనుమతి ఒక కీలక మైలురాయిగా నిలిచిందని, ఎలీ లిల్లీ ఇండియా అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ విన్‌స్లూ టక్కర్ తెలిపారు. అల్జీమర్స్ బాధితులు, వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించడంతో పాటు, రోగుల జీవననిర్వహణను మరింత మెరుగుపరచడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మతిమరుపుతో బాధపడుతున్న వారిలో 60-70 శాతం మందికి అల్జీమర్స్ కారణమని సంస్థ తెలిపింది. భారత్‌లో కూడా ఈ వ్యాధి కేసుల సంఖ్య అధికమేనని పేర్కొంది. 2030 నాటికి దేశంలో దాదాపు 80 లక్షల మందికి మతిమరుపు సమస్య ఉండొచ్చని, అందులో పెద్ద భాగం అల్జీమర్స్ రోగులే ఉంటారని కంపెనీ అంచనా వేసింది.