
Elon Musk: పిల్లలకోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్.. 'బేబీ గ్రోక్'ను ప్రకటించిన ఎలాన్ మస్క్!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్‌బాట్ యాప్ రూపొందించనుంది. మస్క్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో ఈ విషయాన్ని వెల్లడించారు. 'బేబీ గ్రోక్' అనే యాప్‌ను రూపొందిస్తున్నామంటూ మస్క్ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. పిల్లలకు తగినదిగా, వారు సురక్షితంగా ఉపయోగించగలిగేలా ఈ చాట్‌బాట్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇది xAI ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన 'గ్రోక్' యొక్క కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. యువ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యాప్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మస్క్ ఇంకా వెల్లడించలేదు.
Details
ఈ టూల్ ఉపయోగంతో అనేక లాభాలు
ఈ ప్రకటన ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌లో స్పామ్ సమస్యల నేపథ్యంలో గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత రావడం గమనార్హం. మరోవైపు గ్రోక్ సామర్థ్యాలను మెరుగుపర్చే దిశగా మస్క్ ఇప్పటికే చర్యలు చేపట్టారు. వైరల్ వీడియోలను జనరేట్ చేయగల 'ఇమాజిన్' అనే క్రియేటివ్ ఫీచర్‌ను గ్రోక్‌లో జోడించే పనిలో ఉన్నట్లు కూడా ఆయన ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం ఏఐ వినియోగం పిల్లల్లోనూ వేగంగా పెరుగుతోంది. తాజా అధ్యయనాల ప్రకారం 44శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది. ఇందులో 54% మంది విద్యార్థులు తమ స్కూల్ లేదా హోమ్ వర్క్ కోసం ఈ టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.