Page Loader
ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్ 
ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్

ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ నంబర్ 1కు చేరుకున్న ఎలోన్ మస్క్ 

వ్రాసిన వారు Stalin
Jun 01, 2023
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తిరిగి నంబర్ 1స్థానాన్ని పొందారు. లగ్జరీ వస్తువుల తయారీ సంస్థ ఎల్‌వీఎంహెచ్ షేర్లు భారీగా పతనమైన నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ సంపద భారీగా తగ్గింది. దీంతో బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి ఎలోన్ మస్క్ మళ్లీ మొదటిస్థానంలోకి దూసుకొచ్చారు. పారిస్ స్టాక్ మార్కెట్‌లో బుధవారం ఒక్కరోజే ఆర్నాల్ట్ ఎల్‌వీఎంహెచ్ సంస్థ షేర్లు 2.6 శాతం తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఏప్రిల్ నుంచి ఎల్‌వీఎంహెచ్ మార్కెట్ విలువ దాదాపు 10 శాతం పడిపోయింది. ఒక్కరోజులోనే ఆర్నాల్డ్ రూ.90వేల కోట్లను కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

మస్క్

మస్క్ సంపద విలువ 192.3 బిలియన్ డాలర్లు

లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ ఎల్‌వీఎంహెచ్ సీఈఓ అయిన ఆర్నాల్ట్ డిసెంబర్ 2022లో ప్రపంచ కుబేరుల జాబితాలో నంబర్ 1స్థానానికి చేరుకున్నారు. టెస్లా షేర్లు బాగా పడిపోవడంతో అప్పుడు మస్క్‌ను ఆర్నాల్డ్ అధగమించారు. 2022లో మస్క్ మార్కెట్ నికర విలువ 200బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే మస్క్ ఈ సంవత్సరం 55.3బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లాభాలతో పుంజుకున్నన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని సంపద విలువ ఇప్పుడు సుమారు 192.3బిలియన్ డాలర్లుగా ఉంది. ఆర్నాల్ట్ సుమారు 186.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. 51ఏళ్ల మస్క్ ప్రస్తుతం కార్ల కంపెనీ టెస్లాతో పాటు రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్‌లకు కూడా నాయకత్వం వహిస్తున్నారు.