RAC ending soon: ప్రయాణికులకు త్వరలో ఊరట.. ఆర్‌ఏసీ రద్దు దిశగా రైల్వే శాఖ..
ఈ వార్తాకథనం ఏంటి
రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యల్లో ఆర్‌ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) విధానం ఒకటి. టికెట్‌కు పూర్తి ధర చెల్లించినప్పటికీ.. ప్రయాణ సమయంలో సగం బెర్త్‌తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ముందుగానే ప్రయాణ ప్రణాళిక వేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం వాయిదా వేసుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఏసీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
వివరాలు
ఒకే బెర్త్‌పై ఇద్దరు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
సాధారణంగా రైళ్లలో అందుబాటులో ఉన్న బెర్తుల కంటే రిజర్వేషన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్‌ఏసీ టికెట్లు కేటాయిస్తారు.
ఈ విధానంలో టికెట్ పూర్తిస్థాయిలో కన్ఫార్మ్ కాకపోయినా ప్రయాణానికి అనుమతి ఉంటుంది.
అయితే, ఒక సైడ్ బెర్త్‌ను ఇద్దరు ప్రయాణికులకు కేటాయిస్తారు. దీంతో ఇద్దరూ ఒకే బెర్త్‌పై సర్దుకుని ప్రయాణించాల్సి వస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఒకే బెర్త్‌ను మహిళ,పురుష ప్రయాణికులకు కేటాయించినప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
వారిద్దరినీ సర్దుబాటు చేయడానికి టీటీఈలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఈ సమస్యను పార్లమెంటరీ ప్యానెల్ సైతం ప్రస్తావించింది. పూర్తి స్థాయి బెర్త్ అందించకుండా ప్రయాణికుల నుంచి పూర్తి టికెట్ ధర వసూలు చేయడంలో ఉన్న హేతుబద్ధతను ప్రశ్నించింది.
వివరాలు
ఒకే బెర్త్‌పై ఇద్దరు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
ఆర్‌ఏసీ రిజర్వేషన్ విధానాన్ని మరోసారి సమీక్షించాలని రైల్వే శాఖకు సూచించింది.
ఈ నేపథ్యంలో ఆర్‌ఏసీ విధానాన్ని రద్దు చేసే అంశంపై భారతీయ రైల్వే దృష్టి సారించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. రైల్వే శాఖ అధికారికంగా నిర్ణయం ప్రకటించే వరకు ఈ విధానం కొనసాగనుంది.
వివరాలు
ఎలా ప్రారంభమైంది?
గతంలో రైల్వే టికెట్ రిజర్వేషన్ల ప్రక్రియ మాన్యువల్ పద్ధతిలో జరిగేది.
ఆ సమయంలో ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకుంటే.. అప్పటికే కేటాయించిన బెర్తులు ఖాళీగా ఉండిపోయేవి.
ఇలా ఖాళీగా ఉన్న బెర్తులను తిరిగి ఇతరులకు కేటాయించే ఉద్దేశంతో ఆర్‌ఏసీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఎవరైనా ప్రయాణికులు తమ టికెట్‌ను రద్దు చేసుకున్నప్పుడు ఆ బెర్తును ఆర్‌ఏసీ ప్రయాణికులకు కేటాయించే అవకాశం ఉండేది.
అప్పట్లో టికెట్ రద్దులను ఎప్పటికప్పుడు గుర్తించి, ఖాళీ అయిన బెర్తులను ఇతరులకు కేటాయించేందుకు అవసరమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థ అందుబాటులో లేదు.
ఈ పరిస్థితుల్లో ఉపయోగకరంగా భావించి ప్రవేశపెట్టిన ఆర్‌ఏసీ విధానం.. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది.