LOADING...
EPFO: యూఏఎన్‌ కేటాయింపు,యాక్టివేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసిన ఈపీఎఫ్‌వో  
యూఏఎన్‌ కేటాయింపు,యాక్టివేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసిన ఈపీఎఫ్‌వో

EPFO: యూఏఎన్‌ కేటాయింపు,యాక్టివేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసిన ఈపీఎఫ్‌వో  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు (యూఏఎన్‌) కేటాయింపు, యాక్టివేషన్‌ ప్రక్రియను ఇంకా సులభంగా మార్చింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌లో చేరే నూతన ఉద్యోగులు,గతంలో ఉద్యోగం చేసినప్పటికీ ఇప్పటికీ యూఏఎన్‌ పొందని వారు,లేదా గతంలో పొందిన యూఏఎన్‌ను తిరిగి యాక్టివేట్‌ చేసుకోవాలనుకునే వారు ఇకపై యాజమాన్యం లేదా ఈపీఎఫ్‌వో కార్యాలయంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వారు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే ఈ సేవలను పొందగలుగుతారు. ఇందుకోసం రెండు ముఖ్యమైన మొబైల్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అయితే, భారత్‌లో ఉద్యోగం చేసే అంతర్జాతీయ ఉద్యోగులు మరియు నేపాల్‌, భూటాన్‌ పౌరులకు సంబంధించిన యూఏఎన్‌ నిర్వహణ మాత్రం యాజమాన్యాలే నిర్వహించాల్సి ఉంటుంది.

వివరాలు 

కొత్తగా యూఏఎన్‌ పొందాలంటే..

ఉమాంగ్‌ యాప్‌లోని 'యూఏఎన్‌ అలాట్‌మెంట్‌' లింక్‌ను ఓపెన్‌ చేయాలి. ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి వాటిని ధృవీకరించాలి. మొబైల్‌ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి. యాప్‌ ద్వారా ఆధార్‌ ఇప్పటికే ఏదైనా యూఏఎన్‌తో అనుసంధానమై ఉందా అనే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముందుగా యూఏఎన్‌ ఉన్నట్లయితే అది తెలియజేస్తుంది, హోమ్‌పేజీకి తిరిగి తీసుకుపోతుంది. ఒకవేళ కొత్త యూఏఎన్‌ అవసరమైనవారైతే, ఫేస్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఆధార్‌ఫేస్‌ఆర్‌డీ యాప్‌ ద్వారా ముఖాన్ని స్కాన్‌ చేసిన తర్వాత, కొత్తగా కేటాయించిన యూఏఎన్‌ వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా మొబైల్‌కు వస్తాయి.

వివరాలు 

ఇప్పటికే ఉన్న యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకోవాలంటే... 

గతంలో కేటాయించినా యూఏఎన్‌ యాక్టివ్‌ కాకపోతే, తిరిగి యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఉమాంగ్‌ యాప్‌లో 'యూఏఎన్‌ యాక్టివేషన్‌' ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ యూఏఎన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాలి. ఈపీఎఫ్‌వో డేటాబేస్‌ ఆధార్‌, యూఏఎన్‌ అనుసంధానాన్ని చెక్‌ చేస్తుంది. తర్వాత ఫేస్‌ అథెంటికేషన్‌ యాప్‌ ద్వారా ముఖాన్ని స్కాన్‌ చేయాలి. ధృవీకరణ పూర్తయిన వెంటనే, మొబైల్‌కు యూఏఎన్‌ నంబర్‌తో పాటు తాత్కాలిక పాస్‌వర్డ్‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది.

వివరాలు 

ఫేస్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి 

యూఏఎన్‌ యాక్టివేషన్‌ ప్రక్రియలో ఫేస్‌ అథెంటికేషన్‌ కీలకంగా మారింది. దీనికోసం ఆధార్‌ఫేస్‌ఆర్‌డీ యాప్‌ ద్వారా ముఖాన్ని స్కాన్‌ చేయాలి. యూఏఎన్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌లను సరిచూసి ధృవీకరించబడుతుంది. సేవలలో ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, ఉమాంగ్‌ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.

వివరాలు 

ఈ మార్పుల వల్ల లభించే లాభాలు 

మొబైల్‌ ద్వారా ఈ-యూఏఎన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం. ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీ ద్వారా ఆధార్‌ ఆధారంగా యూఏఎన్‌ కేటాయింపు, యాక్టివేషన్‌ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. పాస్‌బుక్‌ వీక్షణ, కేవైసీ అప్‌డేట్‌, క్లెయిమ్‌ దరఖాస్తు వంటి ఈపీఎఫ్‌వో సేవలను సులభంగా పొందవచ్చు. అవసరమైన యాప్‌లు ఈ సేవలు పొందటానికి మీ మొబైల్‌ ఫోన్‌లో ఉమాంగ్‌ యాప్‌ (Unified Mobile Application for New-age Governance), యూఐడీఏఐ ఆధార్‌ఫేస్‌ఆర్‌డీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆధార్‌ నంబర్‌తో పాటు, ఓటీపీ కోసం ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి.