LOADING...
EPFO: ఇక 3 రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్.. ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు
ఇక 3 రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్.. ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు

EPFO: ఇక 3 రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్.. ఈపీఎఫ్‌వో కొత్త నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పీఎఫ్ సభ్యులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన పీఎఫ్ ఉపసంహరణ (విత్‌డ్రాయల్) దరఖాస్తులను ఇకపై మూడు రోజుల్లోనే పరిష్కరించే కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇటీవల కాలంలో క్లెయిమ్‌ల పరిష్కార విధానంలో ఇది అత్యంత కీలక మార్పుగా భావిస్తున్నారు. ఈ కొత్త విధానం అమలుతో సభ్యులు తమ పీఎఫ్ పొదుపు మొత్తాన్ని త్వరగా పొందే అవకాశం కలగనుంది. అలాగే ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చేందుకు ఈపీఎఫ్‌వో చర్యలు చేపట్టింది. మానవ జోక్యాన్ని తగ్గించి, డిజిటల్ విధానాల వినియోగాన్ని పెంచుతోంది.

వివరాలు 

3 రోజుల్లో క్లెయిమ్ పరిష్కారం ఎలా?

కొత్త నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పీఎఫ్ క్లెయిమ్‌లను మూడు రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. గతంలో మాన్యువల్ వెరిఫికేషన్,ఇతర పరిపాలనా ప్రక్రియల కారణంగా సభ్యులు ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వచ్చేది. కొత్త విధానం వల్ల ఆ ఆలస్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే సరైన కారణం లేకుండా 20రోజులకు మించి క్లెయిమ్‌లను పెండింగ్‌లో ఉంచితే బాధ్యులైన అధికారులపై 12శాతం పెనాల్టీ వడ్డీ విధించే నిబంధనను కూడా తీసుకొచ్చింది. దీంతో నిర్ణీత గడువులో క్లెయిమ్‌లను పరిష్కరించే బాధ్యత అధికారులపై మరింత పెరగనుంది. అయితే పూర్తి కేవైసీ(KYC)వివరాలు,అవసరమైన అర్హతలు ఉన్న క్లెయిమ్‌లకే మూడు రోజుల గడువు వర్తిస్తుంది. అదనపు పరిశీలన అవసరమైన కేసులు మాత్రం కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

వివరాలు 

రూ.5 లక్షలకు ఆటో సెటిల్‌మెంట్ పరిమితి

ఈ సంస్కరణల్లో భాగంగా పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ డిజిటల్ ధృవీకరణను విస్తరిస్తోంది. ఇప్పటికే ఆటో సెటిల్‌మెంట్ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఇంతకుముందు రూ.1 లక్ష వరకు మాత్రమే ఆటో సెటిల్‌మెంట్ అవకాశం ఉండగా, ఇప్పుడు దానిని రూ.5 లక్షలకు పెంచింది. దీంతో మరిన్ని అడ్వాన్స్ విత్‌డ్రాయల్ క్లెయిమ్‌లు ఎలాంటి మాన్యువల్ పరిశీలన లేకుండానే వేగంగా పరిష్కారం కానున్నాయి. ఈ మార్పుల వల్ల పత్రాల సమర్పణ తగ్గడం, క్లెయిమ్ తిరస్కరణలు తగ్గడం, సభ్యులకు మెరుగైన సేవలు అందడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని ఈపీఎఫ్‌ఓ భావిస్తోంది.

Advertisement

వివరాలు 

సభ్యులకు కలిగే ప్రయోజనాలు

వైద్య అత్యవసర పరిస్థితులు, విద్య, వివాహం, ఇల్లు నిర్మాణం లేదా కొనుగోలు, నిరుద్యోగం వంటి అర్హత కలిగిన అవసరాల కోసం పీఎఫ్ ఉపసంహరణ చేసుకునే సభ్యులకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడనుంది. ఆధార్‌తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), నవీకరించిన బ్యాంకు ఖాతా వివరాలు,పూర్తి కేవైసీ ఉన్న సభ్యులు తమ డబ్బులను గతంతో పోలిస్తే చాలా త్వరగా పొందే అవకాశం ఉంది. అయితే ఉద్యోగి, యాజమాన్యం చెల్లించే పీఎఫ్ చందాలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటిలాగే ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12 శాతం, యాజమాన్యం కూడా 12 శాతం చొప్పున చెల్లిస్తాయి. ఈ సంస్కరణలు ప్రధానంగా సేవలను మరింత వేగంగా, డిజిటల్ విధానంలో అందించడంపైనే దృష్టి సారించాయి.

Advertisement

వివరాలు 

పీఎఫ్ క్లెయిమ్ చేసేముందు ఇవి తప్పనిసరిగా చూసుకోండి

పీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేయాలనుకునే సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఆధార్‌ను యూఏఎన్‌తో అనుసంధానం చేయాలి. పాన్, బ్యాంకు ఖాతా వివరాలను అప్డేట్ చెయ్యాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు,ఓటీపీ ధృవీకరణ కోసం నమోదైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండాలి. ఈ వివరాలు సక్రమంగా ఉంటే కొత్త విధానం కింద క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం కావడంతో పాటు అనవసరమైన ఆలస్యాలు కూడా నివారించవచ్చు. ఈ మార్పులు ఈపీఎఫ్‌వో చేపడుతున్న ఈపీఎఫ్‌వో 3.0డిజిటల్ రూపాంతర కార్యక్రమంలో భాగం. ఇందులో భాగంగా భవిష్యత్తులో యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ,ఏటీఎం అనుసంధాన సేవలు వంటి మరిన్ని డిజిటల్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ చర్యలు చేపడుతోంది.

Advertisement