
March AMFI Data: మార్చిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లో 14 శాతం డౌన్..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
ఇందుకు మన దేశ మార్కెట్లు కూడా మినహాయింపు కావు. ఈ పరిణామం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
వరుసగా మూడవ నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగించే అంశం.
మార్చి నెలలో ఈ పెట్టుబడులు గతంతో పోల్చితే 14 శాతం తగ్గి రూ.25,082 కోట్లకు పరిమితమయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (AMFI) ఈ గణాంకాలను విడుదల చేసింది..
వివరాలు
డిసెంబర్‌లో ఈ పెట్టుబడులు రూ.41,156 కోట్లు
ఈ ఏడాది ప్రారంభంలో, జనవరిలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో రూ.39,688 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
కానీ ఫిబ్రవరిలో ఇది రూ.29,303 కోట్లకు తగ్గింది. మరింతగా తగ్గి మార్చిలో ఈ మొత్తం రూ.25,082 కోట్లకు చేరింది.
ఇంతకుముందు డిసెంబర్‌లో ఈ పెట్టుబడులు రూ.41,156 కోట్లుగా ఉన్న సంగతి విశేషం.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోని వివిధ విభాగాలలో, మార్చి నెలలో ఫ్లెక్సీక్యాప్ ఫండ్లలో అత్యధికంగా రూ.5,165 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.
అయితే సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్లలో పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి.
ఫిబ్రవరిలో ఈ విభాగానికి రూ.5,711 కోట్లు వచ్చినా, మార్చిలో కేవలం రూ.735 కోట్లు మాత్రమే వచ్చాయి.
వివరాలు
లార్జ్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు మాత్రం కొంత తగ్గాయి
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో మాత్రం పెట్టుబడులు స్థిరంగా కొనసాగాయి.
మార్చిలో మిడ్‌క్యాప్స్‌లోకి రూ.3,439 కోట్లు, స్మాల్‌క్యాప్స్‌లోకి రూ.4,092 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇది ఫిబ్రవరిలో నమోదైన రూ.3,406 కోట్లు (మిడ్‌క్యాప్), రూ.3,722 కోట్లు (స్మాల్‌క్యాప్) తో పోల్చితే వృద్ధిని సూచిస్తోంది.
లార్జ్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు మాత్రం కొంత తగ్గాయి. ఫిబ్రవరిలో రూ.2,866 కోట్లు వచ్చిన పెట్టుబడులు, మార్చిలో రూ.2,479 కోట్లకు తగ్గిపోయాయి. అలాగే గోల్డ్ ETF లలో కూడా ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోయింది.
ఫిబ్రవరిలో రూ.1,980 కోట్లు వచ్చినా, మార్చిలో ఇది కేవలం రూ.77 కోట్లకు మాత్రమే పరిమితమయ్యింది.
వివరాలు
ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్ రంగం రూ.40,000 కోట్ల ఇన్‌ఫ్లో నమోదు
డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో మాత్రం భారీగా నిధులు వెనక్కి వెళ్లాయి. మార్చి నెలలో మొత్తం రూ.2.02 లక్షల కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి,
ఫిబ్రవరిలో నమోదైన రూ.6,525 కోట్ల ఇన్‌ఫ్లోతో పోల్చితే ఇది భారీ వెనుకడుగు.
సమగ్రంగా పరిశీలిస్తే, ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్ రంగం రూ.40,000 కోట్ల ఇన్‌ఫ్లోను నమోదు చేసినప్పటికీ, మార్చిలో మాత్రం నికరంగా రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.
అయితే, పెట్టుబడులు తగ్గినప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న ఆస్తుల మొత్తం విలువ (AUM) మాత్రం పెరిగింది.
ఫిబ్రవరిలో రూ.64.53 లక్షల కోట్లగా ఉన్న ఆస్తుల విలువ, మార్చి నెలలో రూ.65.7 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.