
White House: ఆపిల్,మెటాపై EU జరిమానాలను 'ఆర్థిక దోపిడీ'గా అభివర్ణించిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్, మెటా సంస్థలపై ఐరోపా యూనియన్ (EU) విధించిన భారీ జరిమానాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది.
ఈ చర్యను అది ఒక "కొత్తరకమైన దోపిడీ"గా అభివర్ణించింది. అమెరికాకు చెందిన సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటివి చేయడం తాము సహించబోమని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
''అమెరికా కంపెనీలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ, వాటిని బలహీనపరచే విధంగా, ఆవిష్కరణలపై దెబ్బతీసేలా, మౌనాన్ని (సెన్సార్‌షిప్) ప్రోత్సహించేలా చేసే చర్యలన్నింటినీ మేము నేరుగా ముప్పుగా పరిగణిస్తాము'' అని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
వివరాలు
200 మిలియన్ యూరోలు జరిమానా
యూరోపియన్ కమిషన్ ఇటీవలే యాపిల్, మెటా సంస్థలపై భారీ జరిమానాలు విధించింది.
యాపిల్ సంస్థ యాప్ స్టోర్‌కు బయట తక్కువ ధర ఉన్న ప్రత్యామ్నాయాలను యాప్ డెవలపర్లకు చూపకుండా అడ్డుకుంటోందనే కారణంగా దాదాపు 500 మిలియన్ యూరోలు (సుమారు రూ. 5,000 కోట్లు) జరిమానా విధించింది.
ఇక మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కి మాతృసంస్థ) వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన ప్రకటనలను చూపించేందుకు లేదా వాటిని తొలగించేందుకు చెల్లింపు ఆప్షన్లు బలవంతంగా పెట్టిందని అభియోగం మోపుతూ, దాదాపు 200 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,000 కోట్లు) జరిమానా విధించింది.
ఈయూ కమిషన్ తీసుకున్న నిర్ణయాల అమలుకు 60 రోజులు గడువుగా ఇచ్చింది. ఈ కాలపరిమితిలో యాపిల్, మెటా సంస్థలు ఆ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
వివరాలు
ట్రంప్ హయాంలో కూడా ఐరోపా యూనియన్‌పై సుంకాల విధానాలు
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో కూడా ఐరోపా యూనియన్‌పై సుంకాల విధానాలు మోత మోగించాయి.
అయితే ప్రస్తుతం 90 రోజుల విరామాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా విధించిన సుంకాలు అన్యాయంగా ఉండటంతో పాటు, ఆయా చర్యలు ఇరు పక్షాలకు మాత్రమే కాకుండా, మొత్తం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని యూరోపియన్ కమిషన్ పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే, ఒకవేళ ఇరుదేశాల మధ్య న్యాయమైన చర్చలు జరిగితే, ప్రతీకార చర్యల్ని విరమించే అవకాశం కూడా ఉందని EU గతంలో తెలిపింది.
ఇప్పుడు జారీ అయిన జరిమానాలు, వైట్‌హౌస్ చేసిన హెచ్చరికలు ఈ పరిణామాల నడుమ చోటుచేసుకున్నాయి.