నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి; బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మే 19న రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అన్ని బ్యాంకులు మంగళవారం నుంచి 2,000 రూపాయల నోట్లను మార్పిడిని స్వీకరిస్తున్నాయి. సెప్టెంబర్ 30వరకు నోట్లను బ్యాంకులు స్వీకరించనున్నాయి. అయితే బ్యాంకులకు వెళ్లే ముందు ఈ విషయాలను తెలుసుకోండి. ఇప్పటికిప్పుడు బ్యాంకులకు వెళ్లి రూ.2వేల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కరెన్సీ మార్చుకోవడానికి ఆర్బీఐ సెప్టెంబర్ 30వరకు గుడువు విధించినా, ఆ తర్వాత కూడా నోటును వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. సెప్టెంబర్ 30వరకు ఎన్ని నోట్లు వస్తాయో చూసి, ఆ తర్వాత రూ.2000నోట్లపై తుది నిర్ణయం ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
డిపాజిట్లు ఎంతైనా చేసుకోవచ్చు
ఖాతాదారులు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రూ.2000నోట్లను రోజుకు కేవలం 10 మాత్రమే మార్చుకోవచ్చు. అయితే డిపాజిట్ చేసుకోవానికి పరిమితి లేదు. భారీ మొత్తంలో డిపాజిట్ లావాదేవీల విషయంలో కచ్చితంగా KYC మార్గదర్శకాలను పాటించాలి. రూ.50,000 కంటే తక్కువ డిపాజిట్లకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. రూ. 50,000 కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను నియమం ప్రకారం పాన్‌ను సమర్పించాలి. ఎస్బీఐ నోట్లను మార్చుకోవాలంటే రిక్వెస్ట్ ఫామ్‌ను నింపాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి రిక్విజిషన్ స్లిప్ లేకుండానే ఎస్‌బీఐ ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు రూ.2,000 నోట్లను మార్చుకునే సదుపాయం కల్పిస్తోంది.
క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రూ.2000నోట్ల ఉపసంహరణ
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో నోట్లను మార్చుకునేందుకు బ్యాంక్‌లకు వచ్చే ఖాతాదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. క్యూలో ఉన్న ప్రజలకు తాగునీరు కూడా ఏర్పాటు చేయాలని, నోట్ల మార్పిడికి కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను కోరింది. చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ.2వేల నోట్లు 10.8 శాతం మాత్రమే. దీంతో రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం ఆర్థిక వ్యవస్థపై చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సెప్టెంబరు 30 నాటికి చాలా వరకు బ్యాంకులకు తిరిగి వస్తాయని భావిస్తున్నామన్నారు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ రూ.2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంది. మెరుగైన భద్రతా కారణాలతో నాణేలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.