LOADING...
Explained: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత్ ఇంధన భద్రతపై ప్రభావం?
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత్ ఇంధన భద్రతపై ప్రభావం?

Explained: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత్ ఇంధన భద్రతపై ప్రభావం?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మార్గం కీలకంగా మారింది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో దాదాపు 20-25 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల క్రూడ్ వినియోగంలో సుమారు 40శాతం ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఇరాన్ దాడులను ఖండించారు. అలాగే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కూడా చర్చించారు.

వివరాలు 

50 శాతం పెరిగిన షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 

పరిస్థితులు అదుపులోకి రావాలని, సాధారణ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ స్పష్టం చేశారు. దేశ భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించి విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, ప్రయాణ ఆంక్షలు, ఆర్థిక ప్రభావాలపై సమీక్షించారు. ఇరాన్ ప్రాంతంలో ప్రమాదం పెరిగిన నేపథ్యంలో భారత నావికాదళ సిబ్బందిని అక్కడ విధుల్లో పెట్టవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సూచించింది. షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియాలు ఒక్కసారిగా దాదాపు 50 శాతం పెరిగినట్లు సమాచారం. భారత్ తన క్రూడ్ అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. రోజుకు 2.5-2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు హోర్ముజ్ మార్గం గుండా వస్తోంది.

వివరాలు 

భారత్‌కు ఏడాదికి 13-14 బిలియన్ డాలర్ల అదనపు భారం

ఇరాన్ ఉత్పత్తి దెబ్బతింటే బ్యారెల్ ధర 70 డాలర్ల నుంచి 76-81 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ధరల్లో ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో భారత్‌కు ఏడాదికి 13-14 బిలియన్ డాలర్ల అదనపు భారం పడొచ్చని అంచనా. ఇది రూపాయి విలువ, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చు. ఇక ఇరాన్, ఇరాక్ దేశాలకు భారత్ నుంచి బాస్మతి బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. మొత్తం ఎగుమతుల్లో సుమారు 45 శాతం ఈ రెండు దేశాలకే వెళ్తోంది. గత ఏడాది మాత్రమే ఇరాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల విలువైన బాస్మతి ఎగుమతి అయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్లో బాస్మతి ధర కిలోకు రూ.10 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు 

2022లో కుదిరిన ఇండియా-యూఏఈ వాణిజ్య ఒప్పందం

టీ ఎగుమతులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. మధ్యప్రాచ్య దేశాలతో భారత్ వాణిజ్యం సుమారు 117బిలియన్ డాలర్లకు చేరింది. అందులో యూఏఈ వాటా దాదాపు 100బిలియన్ డాలర్లు. 2022లో కుదిరిన ఇండియా-యూఏఈ వాణిజ్య ఒప్పందం తర్వాత వ్యాపారం మరింత పెరిగింది. అయితే ఉద్రిక్తతలు కొనసాగితే సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90శాతం వరకు చైనా కొనుగోలు చేస్తోంది.ఆ సరఫరా తగ్గితే చైనా రష్యా, సౌదీ, ఇరాక్ చమురుపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్‌కు చమురు కొనుగోలు ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచడం,విద్యుతీకరణను వేగవంతం చేయడం అత్యవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Advertisement