EPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అధిక పింఛనుకు సంబంధించి వేతన వివరాలు సమర్పించే గడువును మరోసారి పొడిగించింది. వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి 2025 జనవరి 31 వరకూ అవకాశం కల్పించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఎంప్లాయర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 3.1 లక్షల పైగా అధిక పింఛను దరఖాస్తులు ఎంప్లాయర్స్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వేతన వివరాలను సమర్పించడానికి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ గడువును అనేక సార్లు పొడిగించారు.
అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
2023 మే 31తో గడువు ముగిసినా, ఆప్షన్/జాయింట్ ఆప్షన్ ధ్రువీకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ఈ దరఖాస్తులను త్వరగా పూర్తిచేయడానికి ఈ గడువు చివరి అవకాశం. పింఛన్ హక్కులు పొందే ఉద్యోగులందరూ తమ వేతన వివరాలను నిర్దిష్ట సమయానికి అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోని, పింఛన్‌కు సంబంధించి తమ వివరాలను యథావిథంగా అప్‌లోడ్ చేయాలని మంత్రిత్వశాఖ ఉద్యోగులను, సంస్థలను కోరింది. ఈ గడువు తర్వాత దరఖాస్తుల ప్రాసెస్‌లో మరింత ఆలస్యం జరుగకుండా కార్యాచరణ చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు.