Alpha India: ఎఫ్‌డీటీఎల్ సడలింపులు రద్దు చేయాలి.. పైలట్ల సంఘం డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
పైలట్లు విధి నిర్వహణలో తీవ్ర అలసటకు గురికాకుండా ఉండేందుకు రూపొందించిన 'అలసట నిర్వహణ నిబంధనలు (FDTL) అమలులో విమానయాన సంస్థలకు ఇచ్చిన తాత్కాలిక సడలింపులను వెంటనే ఎత్తివేయాలని పైలట్ల సంఘం 'ఆల్పా ఇండియా' డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను కోరింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పైలట్లు గుండెపోటుతో మరణించడం ఈ డిమాండ్‌కు నేపథ్యంగా మారింది. పూర్తి స్థాయిలో FDTL నిబంధనలను అమలు చేయడానికి ఒక స్పష్టమైన కాలపట్టికతో కూడిన ప్రణాళికను డీజీసీఏ ప్రకటించాలని ఆల్పా ఇండియా విజ్ఞప్తి చేసింది. అలాగే పైలట్ల అలసటకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేసే అలసట నివేదిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
వివరాలు
విధుల్లో లేని సమయంలో ప్రాణాలను కోల్పోయారు
ఈ వివరాలను త్రైమాసికం వారీగా ప్రజలకు వెల్లడించాలని కూడా కోరింది. ఇటీవల ఎయిర్ ఇండియా కు చెందిన ఒక పైలట్, అలాగే ఆకాశ ఎయిర్‌కు చెందిన మరొక పైలట్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ విధుల్లో లేని సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఎయిరిండియా పైలట్ బాలిలో షెడ్యూల్ రెస్ట్‌లో ఉండగా మరణించగా, ఆకాశ ఎయిర్ పైలట్ శిక్షణలో ఉండగానే మృతి చెందారు. సవరించిన నిబంధనల ప్రకారం పైలట్లకు ఎక్కువ విశ్రాంతి సమయం లభించేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ నిబంధనల అమల్లో ఎదురవుతున్న సవాళ్లు, అలాగే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల ఏర్పడిన అవాంతరాల నేపథ్యంలో విమానయాన సంస్థలకు డీజీసీఏ అదనపు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.