Page Loader
Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 535 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభం 
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు..

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 535 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Today) మంగళవారం మంచి ప్రదర్శన కనబరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ, దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌ కొనుగోళ్లకు మద్దతు లభించడం వల్ల సూచీలు గణనీయంగా లాభపడ్డాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు ప్రవేశపెట్టడానికి రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను బహిరంగ మార్కెట్ కార్యకలాపాల (ఓఎంఓ) ద్వారా కొనుగోలు చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించడంతో ఈ అభివృద్ధి జరిగింది.

వివరాలు 

535 పాయింట్లకు పరిమితమైన సెన్సెక్స్

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మార్కెట్ సూచీలను ముందుకు నడిపించాయి. ఒక దశలో 1100 పాయింట్ల వరకు లాభపడిన సెన్సెక్స్, చివర్లో అమ్మకాల వల్ల లాభాలు 535 పాయింట్లకు పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 23,100 పాయింట్ల మార్కును దాటినప్పటికీ, చివరకు 23 వేల దిగువనే ముగిసింది. అయితే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు నష్టాల్లో ముగియడం గమనార్హం. ఉదయం సెన్సెక్స్ 75,659.00 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,366.17) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాలతో కొనసాగిన సెన్సెక్స్, ఇంట్రాడేలో 76,512.96 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 535.24 పాయింట్ల లాభంతో 75,901.41 వద్ద స్థిరపడింది.

వివరాలు 

బంగారం ఔన్సు ధర 2,748 డాలర్ల

నిఫ్టీ కూడా 128.10 పాయింట్ల లాభంతో 22,957.25 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే మరో 22 పైసలు బలహీనమై 86.53 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అయితే సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 77 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు 2,748 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

ఇతర కారణాలు 

గత కొన్ని రోజులుగా మార్కెట్లు భారీ పతనాన్ని ఎదుర్కొనడం వల్ల మదుపర్లు ఈ పరిస్థితిని సదవకాశంగా భావించి కొనుగోళ్లకు దిగినట్టు నిపుణులు చెబుతున్నారు. అలాగే, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ ధరలు తగ్గడంతో ఎంపిక చేసిన స్టాక్స్‌పై మదుపర్ల ఆసక్తి పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.