Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని ఆమె స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్రం మొత్తం రూ.53.5 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం ఆదాయాన్ని రూ.53,47,315 కోట్లుగా అంచనా వేయగా, అదే స్థాయిలో మొత్తం వ్యయం కూడా ఉంటుందని పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లుగా ఉండగా, ఇందులో పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు, పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు ఉండనున్నట్లు తెలిపారు.
Details
జీడీపీలో అప్పుల వాటా క్రమంగా తగ్గుదల
దేశ అప్పుల పరిస్థితిపై మాట్లాడిన ఆర్థిక మంత్రి, జీడీపీలో అప్పుల వాటా క్రమంగా తగ్గుతుందని చెప్పారు. 2025-26లో జీడీపీలో అప్పుల వాటా 56.1 శాతంగా ఉండగా, 2026-27లో అది 55.6శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు. అప్పుల భారం తగ్గితే వడ్డీ చెల్లింపులు కూడా క్రమంగా తగ్గుతాయని, అలా మిగిలే నిధులను వ్యవసాయం, మౌలిక వసతులు, పేదల సంక్షేమం వంటి కీలక రంగాలపై ఖర్చు చేయవచ్చని ఆమె వివరించారు. బడ్జెట్‌లో మరో కీలక అంశంగా ద్రవ్య లోటును మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య తేడాను సూచించే ద్రవ్య లోటును క్రమంగా తగ్గిస్తున్నామని తెలిపారు. 2025-26లోజీడీపీలో ద్రవ్య లోటు 4.4శాతంగా ఉండగా, 2026-27లో దానిని 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Details
అప్పులను తగ్గించే దిశగా అడుగులు
దీని ద్వారా ప్రభుత్వం అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల గురించి కూడా ఆర్థిక మంత్రి వివరించారు. 2025-26లో ప్రభుత్వం అప్పులు తీసుకోకుండా పొందే ఆదాయం సుమారు రూ.34 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్పారు. ఇందులో కేంద్రానికి వచ్చే నికర పన్ను ఆదాయం రూ.26.7 లక్షల కోట్లు. అదే సమయంలో మొత్తం ప్రభుత్వ వ్యయం సుమారు రూ.49.6 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా వేశారు. ఈ వ్యయంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం చేపట్టే మూలధన వ్యయం సుమారు రూ.11 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపారు. మొత్తం రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలు ఇవేనని మంత్రి పేర్కొన్నారు.
Details
కేంద్ర బడ్జెట్ 2026-27 ముఖ్య అంచనాలు
రెవెన్యూ వసూళ్లు: రూ.35,33,150 కోట్లు పన్ను వసూళ్లు: రూ.28,66,922 కోట్లు పన్నేతర వసూళ్లు: రూ.6,66,228 కోట్లు మూలధన వసూళ్లు: రూ.18,14,165 కోట్లు రుణాల రికవరీ: రూ.38,397 కోట్లు ఇతర వసూళ్లు: రూ.80,000 కోట్లు మూలధన ఆస్తుల కోసం గ్రాంట్లు: రూ.4,92,702 కోట్లు మూలధన ఖాతా: రూ.12,21,821 కోట్లు వాస్తవ మూలధన వ్యయం: రూ.17,14,523 కోట్లు రెవెన్యూ లోటు: రూ.5,92,344 కోట్లు నికర రెవెన్యూ లోటు: రూ.99,642 కోట్లు ద్రవ్య లోటు: రూ.16,95,768 కోట్లు ప్రాథమిక లోటు: రూ.2,91,796 కోట్లు అప్పులు, ఇతర వసూళ్లు: రూ.16,95,768 కోట్లు మొత్తం ఆదాయం: రూ.53,47,315 కోట్లు మొత్తం వ్యయం: రూ.53,47,315 కోట్లు రెవెన్యూ ఖాతా వ్యయం: రూ.41,25,494 కోట్లు వడ్డీ చెల్లింపులు: రూ.14,03,972 కోట్లు