New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే
కొత్త సంవత్సరం 2024, జనవరి1 నుంచి ఆర్థికపరంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి సిమ్ కార్డు జారీకి కొత్త నిబంధనల వరకు పలు స్కీమ్‌ల్లో జనవరి1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. వడ్డీ రేట్లు పెంపు.. సుకన్య సమృద్ధి యోజన(SSAS) వడ్డీ రేటు పెరిగింది.ప్రస్తుతం ఈ పథకంపై 8 శాతం వడ్డీ వస్తోంది.ఈ మేరకు తాజాగా 20 బేసిస్ పాయింట్లు పెంచి 8.2 శాతానికి పెరిగింది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై 7 శాతంగా ఉన్న వడ్డీరేట్లను 7.1శాతానికి పెంచారు.చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి త్రైమాసికానికోసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరిస్తుంటుంది.జనవరి1 నుంచి మార్చి 31 వరకు కొత్త రేట్లు వర్తించనున్నాయి.
ఆటోమొబైల్ ధరలు మరింత ప్రియం..
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు టాటా మోటార్స్ ఆడి, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ జనవరి నుంచి తమ వాహనాల ధరల్ని పెంచుతున్నామని ప్రకటించేశాయి. ముడి సరకు ధరలు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.ఫలితంగా వాహన ధరలు 2 నుంచి 3 శాతం వరకు పెరగనున్నాయి. UPI ఖాతాలు నిలిచిపోతాయి.. ఏడాదికిపైగా పనిచేయకుండా ఉన్న గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎంల వంటి యూపీఐ యాప్‌లోని యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లు ఈ రోజు నుంచే డీయాక్టివేట్ అవుతాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2023 నవంబర్ 7నే ఉత్తర్వులు జారీ చేసింది.
బీమా నిబంధనలు సైతం..
ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని పాలసీ హోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా 'కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్'లను(CIS) విడుదల చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ(IRDAI) బీమా సంస్థలకు సూచనలు జారీ చేసింది. ఈ నిబంధనలు 2024 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చేశాయి. సిమ్ కార్డ్ కోసం నూతన నిబంధనలు.. సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్ నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది. బదులుగా డిజిటల్ వెరిఫికేషన్ తీసుకొచ్చింది. ఇకపై పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి.