
financial planning: నలభై వయసులో ఆర్థిక ప్రణాళిక.. ఎందుకు కీలకం?
ఈ వార్తాకథనం ఏంటి
నలభై ఏళ్లు జీవన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ దశలో చాలామంది ఆర్థికంగా స్థిరపడినా, మరికొందరు తమ భవిష్యత్తుకు కొత్త ప్రణాళికలు వేస్తుంటారు. ఉద్యోగ జీవిత ప్రారంభంలో తీసుకున్న పాలసీలు, పెట్టుబడులను ఇప్పుడు మరోసారి సమీక్షించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈ దశలో తల్లిదండ్రుల సంరక్షణ, పిల్లల చదువు, కుటుంబ ఖర్చులు అన్నీ కలిసి ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి. అందుకే ముందుగానే సిద్ధంగా ఉండటం అవసరం.
Details
లక్ష్యాలు, ప్రణాళికలు
దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు మధ్యంతర లక్ష్యాలపై కూడా దృష్టి పెట్టాలి. మరో ఐదేళ్లలో పిల్లల ఉన్నత చదువుల ఖర్చు, ఇల్లు కొనుగోలు లేదా మరమ్మతులు వంటి విషయాల కోసం ముందస్తుగా నిధి సిద్ధం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ప్రత్యేక నిధి కేటాయించాలి. పదవీ విరమణ ప్రణాళికలను ఇప్పటి నుంచే పక్కాగా ఉంచుకోవాలి. ఆరు నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధి అందుబాటులో ఉండాలి. పెట్టుబడులు పెంచే సమయం ఇది. ఆదాయం లో కనీసం 20% మ్యూచువల్ ఫండ్లలో SIP రూపంలో పెట్టుబడి పెట్టాలి.
Details
పెట్టుబడుల సమీక్ష
కొన్నేళ్ల క్రితం చేసిన పెట్టుబడులు ఎలా పనిచేస్తున్నాయో చూడాలి. మ్యూచువల్ ఫండ్లు, ఉద్యోగ భవిష్యనిధి (EPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF), పీపీఎఫ్, షేర్లు ఇలా అన్నింటినీ సమీక్షించాలి. పెట్టుబడులు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఈక్విటీ 60% - డెట్ 40% అనుపాతం పాటించడం మంచిది. పదవీ విరమణ కోసం జాతీయ పింఛన్ పథకం (NPS) ప్రారంభించాలి. 10 ఏళ్లలోపు అమ్మాయి ఉంటే 'సుకన్య సమృద్ధి యోజన'లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
Details
బీమా భరోసా
బీమా పాలసీలు సరిపోతున్నాయో లేదో తనిఖీ చేయాలి. వార్షిక ఆదాయానికి కనీసం 10-12 రెట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా కనీసం రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ లైఫ్‌స్టైల్ డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే పాలసీలు కొనడం బెటర్. ఖర్చుల్లో జాగ్రత్త ఆదాయం పెరిగిన వెంటనే ఖర్చులు కూడా పెరగడం సహజం. కానీ లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గించకపోతే పొదుపు పెరగదు. ఖరీదైన ఇల్లు, కారు కొనే ముందు తీసుకున్న రుణాలను వేగంగా తీర్చగలమా అనే ప్రశ్న వేసుకోవాలి. అవసరాలు-కోరికల మధ్య సమతుల్యం కాపాడుకోవాలి. కుటుంబ బడ్జెట్‌ను మించి ఖర్చు చేయకూడదు. అప్పులు తగ్గించడం, పొదుపు పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.
Details
పదవీ విరమణ ప్రణాళిక
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని EPF, PPF, NPS, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు మిశ్రమంగా పెట్టాలి. ద్రవ్యోల్బణం సగటు 6%గా పరిగణించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పదవీ విరమణ సమయానికి కనీసం రూ.2 కోట్లకు పైగా రిటైర్మెంట్ ఫండ్ ఉండేలా చూడాలి.