LOADING...
Amazon Pay: అమెజాన్‌ పేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సేవలు ప్రారంభం.. 8శాతం వరకు వడ్డీ
అమెజాన్‌ పేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సేవలు ప్రారంభం.. 8శాతం వరకు వడ్డీ

Amazon Pay: అమెజాన్‌ పేలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సేవలు ప్రారంభం.. 8శాతం వరకు వడ్డీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు చెందిన ఆర్థిక సేవల విభాగం 'అమెజాన్‌ పే' వినియోగదారుల కోసం కొత్త సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు యూపీఐ, బిల్‌ పేమెంట్స్‌ వంటి డిజిటల్‌ చెల్లింపు సేవలు అందిస్తున్న అమెజాన్‌ పే, తాజాగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (NBFCలు), స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, కమర్షియల్‌ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్‌ పే ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలంటే ప్రత్యేకంగా సేవింగ్స్‌ ఖాతా తెరవాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. అమెజాన్‌ పే యాప్‌ ద్వారానే సులభంగా, పూర్తిగా డిజిటల్‌ విధానంలో ఎఫ్‌డీ చేయొచ్చు.

Details

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే అవకాశం

ఈ సేవ కోసం శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, స్లైస్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలతో అమెజాన్‌ పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. రూ.1,000 నుంచి ఎంతైనా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పెట్టే అవకాశం ఉందని అమెజాన్‌ పే వెల్లడించింది. వార్షికంగా గరిష్ఠంగా 8 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తుందని తెలిపింది. అంతేకాదు మహిళా ఇన్వెస్టర్లకు శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో ఎఫ్‌డీలపై అదనంగా 0.5 శాతం వడ్డీ అందిస్తామని పేర్కొంది. భాగస్వామ్య బ్యాంకుల్లో చేసిన ఎఫ్‌డీలపై డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్(DICGC)కింద రూ.5 లక్షల వరకు బీమా హామీ ఉంటుందని అమెజాన్‌ పే తెలిపింది.

Details

 అమెజాన్‌ యాప్‌లోని 'అమెజాన్‌ పే'

వినియోగదారులు అమెజాన్‌ యాప్‌లోని 'అమెజాన్‌ పే' సెక్షన్‌లో 'ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ పూర్తి చేసిన అనంతరం, నచ్చిన ఆర్థిక సంస్థను డిపాజిట్‌ కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా, పూర్తిగా డిజిటల్‌ ప్రక్రియలోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చని అమెజాన్‌ పే స్పష్టం చేసింది.

Advertisement