Flipkart UPI: సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్
కోట్లాది మంది వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ సంక్షోభం మధ్య, డిజిటల్ చెల్లింపులను మెరుగుపరచడానికి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్ కార్ట్ సొంతంగా UPI హ్యాండిల్‌ను ప్రవేశపెట్టింది. ఈ యూపీఐతో కస్టమర్‌లు ఇప్పుడు Flipkart మార్కెట్ ప్లేస్‌లో, బయట ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం ఫ్లిప్‌కార్ట్ యూపీఐ హ్యాండిల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ యూపీఐ హ్యాండిల్‌ను వినియోగించడం ద్వారా వినియోగదారులు సూపర్ కాయిన్లు, లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలకు కూడా పొందుతారు.
ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే..
Flipkart UPI హ్యాండిల్ ప్రారంభం డిజిటల్ ఇండియాకు ఊతం ఇస్తుందని ఆ సంస్థ చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజనీష్ కుమాన్ తెలిపారు. అలాగే, దేశంలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తన వేగవంతం అవుతుందని, 50 కోట్లకు పైగా కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ యూపీఐ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా Flipkart మార్కెట్‌ప్లేస్ లోపల, లేదా వెలుపల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం వినియోగదారులు ఈ సేవను ఉపయోగించవచ్చని ఆయన వివరించారు. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేవను ప్రారంభించింది. తొలుత ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సేవలు ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.